ప్రజారవాణా వాహనాల్లో మహిళలు, యువతులు, పిల్లల భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం అభయం యాప్ రూపొందించింది. విశాఖలో తొలిదశలో ప్రయోగాత్మకంగా వెయ్యి ఆటోలకు క్యూఆర్ కోడ్‌తో పాటు ఐవోటీ పరికరాలు అమర్చారు. ఆటోలో ఎక్కే మహిళలు.. ఈ క్యూ ఆర్ కోడ్‌ను యాప్‌లోని స్కానర్‌తో స్కాన్ చేయడం ద్వారా ప్రయాణ మార్గం.. ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే సమచారం రియల్ టైంలో సంరక్షకులతో పంచుకోవచ్చు.
మార్గంమధ్యలో ఏదైనా ఇబ్బంది తలెత్తితే యాప్‌లోని ప్యానిక్ బటన్ లేదా ఆటోలో ఏర్పాటు చేసిన ఐఓటీ పరికరంలోని అత్యవసర మీట నొక్కితే సరిపోతుంది. నిమిషాల వ్యవధిలోనే వాహనం ఆగిపోతుంది. ఆ వెంటనే సదరు వాహన డ్రైవర్‌కు పోలీసుల నుంచి ఫోన్ వెళ్తుంది. ఈ ప్రక్రియ జరుగుతుండగానే సమీపంలో ఉండే పోలీసులు సదరు వాహనం వద్దకు చేరుకుంటారు.
అభయం యాప్‌పై మహిళలు సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. విశాఖ ఆటోవాలాలు కూడా ప్రభుత్వ ప్రయత్నాలను స్వాగతిస్తున్నారు. విశాఖలో అభయం యాప్, ఐఓటీ పరికరాలు పని చేస్తున్న తీరును నమూనాగా తీసుకుని మిగిలిన జిల్లాలకు ఈ సేవలను ప్రభుత్వం విస్తరించనుంది.