అందరూ క్లాసులకు వెళ్తుంటే... ఆమె క్లాసయ్యాక మిగిలిన సమయాన్ని సేవకోసం వెచ్చించేది. పేవ్‌మెంట్ల మీద నిద్రించే ఒంటరి, అనాథ మహిళల గురించి కాలేజీ రోజుల నుంచే ఆలోచించడం మొదలుపెట్టింది మల్లీశ్వరి. ఆమె స్వస్థలం ప్రకాశం జిల్లా బెస్తవారిపేట. తండ్రి చెన్నకేశవులు బ్యాంకు ఉద్యోగి. తల్లి గృహిణి. ఎంబీయే చదవడం కోసం పదేళ్ల కిందట విశాఖపట్నం వచ్చారామె. చదువుతున్న సమయంలోనే ఒంటరి ఆడవాళ్లు, బాలికలపై జరుగుతున్న అకృత్యాలపై పోరాడ్డం మొదలుపెట్టారు. విశాఖ రైల్వేస్టేషన్ సమీపంలో ఒంటరి మహిళలు, భిక్షాటన చేసే పిల్లలు, డ్రగ్స్‌కి బానిసలైన వారిలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నించే వారు. అప్పుడే ఆమెకు వాళ్లపై జరుగుతున్న అత్యాచారాల గురించి తెలిసింది. స్నేహితుల సహకారంతో ఒంటరి మహిళలకు దుస్తులు అందించే వారు. ఇది నచ్చని ఆకతాయిలు ఆమెను అడ్డుకున్నారు. భయపెట్టారు. ఫోన్లు చేసి ‘బతకాలని లేదా’ అంటూ బెదిరించారు. ఇదెక్కడి దాకా వెళ్లిందంటే... 2012లో ఆమె బండి మీద వెళ్తుండగా లారీతో ఢీకొట్టారు. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది మల్లీశ్వరి. అయినా స్త్రీలు, బాలికల కోసం తన ప్రయత్నాలను ఆపలేదు.
బంగారం తాకట్టు పెట్టి..
చదువుకుంటూ సేవ చేయాలనుకున్నా.. అందుకు డబ్బు లేక ఇబ్బందులు పడ్డారు మల్లీశ్వరి. ఆ సమయంలో తన బంగారాన్ని తాకట్టుపెట్టేసే వారు. పీజీ చేశాక పీహెచ్‌డీలో చేరి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ, సేవా కార్యక్రమాలు కొనసాగించారు. ‘కొందరు దాతలు పిల్లలు, అనాథల కోసం సాయం చేస్తామని చెప్పి... తీరా కార్యక్రమం రోజున ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసేవారు. అప్పుడు మరో దారి లేక నా దుద్దులు, గొలుసు, ఇతర ఆభరణాలను తాకట్టు పెట్టి డబ్బు తెచ్చేదాన్ని. ఇలా చాలా సార్లు చేశాను. ఒకసారి నగల్లేకుండా ఇంటికెళితే తిడతారని హాస్టల్‌లోనే ఉండిపోయా. చివరికి నా కార్యక్రమాల గురించి ఇంట్లో తెలిసి మొదట బాధపడ్డారు. నాన్న మాత్రం సేవచేస్తూనే బ్యాంకు ఉద్యోగం సాధించాలని ప్రోత్సహించారు’ అంటారు మల్లీశ్వరి.
ఉద్యోగాన్ని వదులుకొని..
తండ్రి కలని నెరవేరుస్తూ... 2014లో సహకార బ్యాంకులో పీవో ఉద్యోగానికి ఎంపికయ్యారు. మొదటి ఏడాదే ఉత్తమ అధికారిగా ప్రశంసలు అందుకున్నారు. బ్యాంకులో పనిచేస్తూనే నక్కవానిపాలెంలోని ఓ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని అవగాహన కార్యక్రమాలు మొదలుపెట్టారు. పేద పిల్లల తల్లిదండ్రులకు సంరక్షణ గురించి తెలియదనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసుకున్నారు. ఆడపిల్లలకు పీరియడ్స్‌లో పాటించాల్సిన శుభ్రత, లైంగిక విద్య వంటి అంశాలపై పాఠశాలలకు వెళ్లి బోధించే వారు. స్వీయ రక్షణ పద్ధతులూ నేర్పేవారు. ఆ సమయంలోనే తనలానే సేవామార్గంలో నడుస్తున్న సాయినాథ్‌ను ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఉద్యోగం, సేవ... ఏదో ఒకదానికి న్యాయం చేయాలన్న ఆలోచనతో 2017లో బ్యాంకు మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. తర్వాత ప్రభుత్వ పాఠశాలలో పది మంది విద్యార్థినులను దత్తత తీసుకొని వారి బాగోగులు చూడటం మొదలుపెట్టారు.
చిన్నారుల కోసం ‘టచ్‘
‘ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్టపడటం లేదు. పసిమొగ్గలను సైతం వదలడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వంతోపాటు ప్రజలూ బాధ్యులే. అందుకే చిన్నారుల కోసం ‘టచ్’ కార్యక్రమం మొదలుపెట్టా. మంచి వాళ్ల స్పర్శ ఎలా ఉంటుంది. చెడ్డ వారు ఎలా ప్రవర్తిస్తారు? అపరిచితులతో ఎలా మసులుకోవాలి, ఏదో ఒకటి ఆశ చూపి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఏంచేయాలి వంటి జాగ్రత్తలు పిల్లలకు చెబుతాం. ఈ కార్యక్రమాలని ఇప్పుడు విశాఖలోని 28 పాఠశాలల్లో చేస్తున్నాం. పిల్లల కోసం ‘వన్స్ థింక్ ఇట్’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాం. పది మందితో మొదలైన పిల్లల దత్తత ప్రస్తుతం 49 మందికి చేరింది. వారికి అవసరమైన పుస్తకాలు, దుస్తులు, ఫీజులు మేమే చూసుకుంటాం. ఈ పదేళ్లలో వేల మంది బడి పిల్లలకు అవగాహన కల్పించా. నాకు పిల్లలు లేరని కొందరు హేళన చేస్తుంటారు. నేను పెంచుకుంటున్న 49 మందీ నా పిల్లలు కాదా! అనాథ పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించేందుకు విద్యాసంస్థ స్థాపించాలనేది లక్ష్యం’ అనే మల్లీశ్వరి విశాఖలో ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడూ ప్రజలకు అండగా నిలిచారు. కొవిడ్ సమయంలోనూ ఎంతో మంది నెలల తరబడి సాయం అందించి శెభాష్ అనిపించుకున్నారు.
ఇదీ చదవండి: