MINISTER PAYYAVULA KESHAV ON AP STATE DEBT : గడచిన ఐదేళ్లలో ఇష్టానుసారం అప్పులు తెచ్చి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అప్పులు తేవడం సహా ఖర్చు పెట్టడంలోనూ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. వచ్చే 25 ఏళ్లలో భవిష్యత్ ఆదాయాన్ని చూపించి గత ప్రభుత్వం రహస్యంగా అప్పులు తెచ్చిందని తెలిపారు.
అప్పులు, ఖర్చుల విషయాలను కేబినెట్, శాసనసభ దృష్టికి తీసుకురాకుండా ప్రజాధనాన్ని దారిమళ్లించిందని విమర్శించారు. ప్రభుత్వ రుణాలపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు పయ్యావుల సమాధానం ఇచ్చారు. కేబినెట్, శాసనసభ దృష్టికి తీసుకురాకుండా గత ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దంగా పలు కార్పొరేషన్లు పెట్టి ప్రజాధనాన్ని దారి మళ్లించడమే కాకుండా, రాబోయే ప్రభుత్వాల మనుగడ తెలియకుండా అప్పులు చేశారని మంత్రి కేశవ్ దుయ్యబట్టారు. మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో వైఎస్సార్సీపీ సభ్యులు పదేపదే అడ్డుపడటంతో శాసనమండలి ఛైర్మన్ వారిని వారించారు.
గత పాలకులు ప్రజల ఆదాయం పెంచలేదు - అప్పులు పెంచారు : సీఎం చంద్రబాబు
రాబోయే ప్రభుత్వాలు ఎలా మనుగడ సాగించాలో తెలియకుండా అప్పులు చేశారని, చట్ట సభల పరిధిలోకి రాకుండా అప్పులు చేసి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని మంత్రి పయ్యావుల అన్నారు. ఈ ఏడాది జూన్ నాటికే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు 9 లక్షల 74 వేల కోట్లుగా తేలాయని, అప్పటి నుంచి అన్ని విభాగాలు అప్పులపై శోధిస్తుండటంతో క్రమంగా అవి పెరుగుతున్నట్లు తెలిపారు. బ్యాంకులు ప్రభుత్వాన్ని నమ్మక, ఆస్తులు తాకట్టు పెట్టాలని షరతులు పెడితే తాకట్టు పెట్టారన్నారు.
మంత్రి వివరణపై అభ్యంతరం తెలిపిన బొత్స: గత ప్రభుత్వ విధానాలు సరిగా ఉంటే కొనసాగించాలని, తప్పులుంటే సరిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు పయ్యావుల తెలిపారు. అప్పులపై ఆర్థికమంత్రి వివరణపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. రాష్ట్రానికి ఉన్న అప్పులపై నిజం ఏంటో తేల్చేందుకు హౌస్ కమిటీ వేయాలని కోరారు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై అధ్యయనం చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వ అప్పులపై కేంద్రానికి విన్నవించగా, అవన్నీ రాజ్యాంగ విరుద్ధంగా జరిగినవేనని కేంద్రం కూడా తేల్చిందని ఆర్థిక మంత్రి పయ్యావుల ప్రస్తావించారు.
రాష్ట్రం అప్పు 9.74 లక్షల కోట్లు - ఎవరైనా కాదంటే రండి తేల్చుతా : సీఎం చంద్రబాబు