‘మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదా? అని అడుగుతున్నారు. బూతులు తిట్టడాన్నే వాక్ స్వాతంత్య్రంగా తెదేపా గుర్తిస్తోందా?, ముఖ్యమంత్రిని అసభ్య భావజాలంతో తిట్టించడం మీ సంస్కృతిలో భాగమా అన్నదానిపై సమాధానం చెప్పాలి’ అని వైకాపా ఎమ్మెల్యేలు పార్థసారథి, మేరుగ నాగార్జున, రాజన్నదొర, హఫీజ్‌ఖాన్, వసంత కృష్ణప్రసాద్‌లు తెదేపా అధినేత చంద్రబాబునాయుడిని ప్రశ్నించారు. మంగళవారం రాత్రి వారు ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ‘తెదేపా కార్యాలయం మీద మేం దాడి చేయలేదు. ఎక్కడో హైదరాబాద్‌లో ఉండే మీరు ఈ రోజు చెప్పాపెట్టకుండా విజయవాడలో ఎందుకు దిగారు? ఏ మంటలు పెట్టేందుకు ఏపీలో అడుగుపెట్టారు? ఎక్కడికక్కడ ప్రజలను కులాలు, మతాలవారీగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. మీ అహంకార భావజాలంతో ప్రజలకు సిగ్గులేదని ఎన్నికల ప్రచార సమయంలో అనరాని మాటలన్నారు. మరి వారికి కడుపు మండదా? జనానికి వారిదైన రీతిలో అవకాశం వచ్చినప్పుడు సమాధానం ఇస్తారు. అంతేగాక రాష్ట్రాన్ని డ్రగ్ ఆంధ్రప్రదేశ్ అంటారా? తాడేపల్లిని తాలిబన్లతో పోలుస్తారా? రాష్ట్రంలో హెరాయిన్ వాడుతున్నారా? ఎవరు వాడుతున్నారు? ఎవరు అమ్ముతున్నారు? మీ బంధుమిత్రులు డ్రగ్ ఎడిక్ట్‌గా మారారా? మీ కొడుకు డ్రగ్ ఎడిక్ట్ అంటే మీకు కోపం రాదా?.. రెండున్నరేళ్లుగా పేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వంపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడలేక ఇంతకు దిగజారుతారా? రాష్ట్రంపై 356 నిబంధన ప్రయోగించాలా? ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయంటున్నారు. విఫలమైంది ప్రతిపక్ష నాయకులుగా మీరు, మీ కొడుకే. సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే... మీరు, మీ దత్తపుత్రుడు కలిసి రెచ్చగొట్టే భాషను వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారు, మాట్లాడిస్తున్నారు. కేంద్ర హోంమంత్రితో, కేంద్ర అధికారులతో, గవర్నర్‌తోనూ మాట్లాడానని టీవీల్లో వేయించుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టించానన్న నిజాన్ని కూడా వారందరికీ చెప్పారా? తిరుపతిలో అమిత్ షాపై తెదేపా కార్యకర్తలతో దాడి చేయించారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఆయనకు ఫోన్ చేశారు’ అని ప్రశ్నించారు.
దిగజారుడు రాజకీయాలు: ముత్తంశెట్టి
చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విమర్శించారు. విశాఖ మద్దిలపాలెంలో మంత్రి మాట్లాడుతూ.. సీఎం హోదాలో ఉన్న వ్యక్తిపై తెదేపా నాయకులు ఇష్టానుసారం మాట్లాడం తగదన్నారు. తన ఇంట్లో ఉన్న సమస్యలతో చంద్రబాబు ఒత్తిడికి గురవుతున్నట్లు ఉందన్నారు.
బాబే కుట్రకు ఆద్యుడు...: మల్లాది విష్ణు
‘వైకాపా, ముఖ్యమంత్రిపై లేనిపోనివి మాట్లాడుతూ... రెచ్చగొట్టి అల్లకల్లోలం సృష్టించాలని చంద్రబాబు రచించిన కుట్ర ఇది. రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘటనలకు, దాడులకు పూర్తిగా చంద్రబాబే బాధ్యత వహించాలి’ అని వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ‘వైకాపా శ్రేణులు దాడులు చేశాయనేది అబద్ధం. ఈ కుట్రకు చంద్రబాబే ఆద్యుడు, బాధ్యుడు.. ఆయన పార్టీ నేతల ప్రెస్‌మీట్లు, వారు మాట్లాడుతున్న తీరే ఇందుకు నిదర్శనం’ అని వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో విష్ణు విలేకరులతో మాట్లాడారు. ‘చంద్రబాబు ముందుగా రాసుకున్న స్క్రిప్టు ఇది. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని ఆయన పనిగట్టుకుని చేస్తున్న పని ఇది. పట్టాభితో ముఖ్యమంత్రిని తిట్టించిన చంద్రబాబు ముందు క్షమాపణ చెప్పాలి’ అని విష్ణు అన్నారు.
మాకు సహనం ఉంది కాబట్టే.. : సుధాకర్‌బాబు
‘చవకబారు, తెరచాటు రాజకీయాలకు సీఎం జగన్ వ్యతిరేకం. ఆయన రాజకీయం నేరుగానే ఉంటుంది. ఎవరితోనో రాళ్లు వేయించే ఖర్మ మాకు పట్టలేదు. వారి ఇళ్లపై దాడులు చేయించే నీచ రాజకీయాలు, భౌతికంగా వాళ్లని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు మేం చేయం’ అని వైకాపా ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు అన్నారు. ‘పట్టాభి ఉచ్చరిస్తున్న పదాలు మా గుండెల్లో గుచ్చుకుంటున్నా... సంస్కారవంతుడైన నాయకుడి పార్టీలో సహనంతో పని చేస్తున్నాం కాబట్టే నీవు(పట్టాభి) బతికిపోతున్నావ్’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేశ్‌లను ఎమ్మెల్యే సుధాకర్‌బాబు పరుష పదజాలంతో విమర్శించారు.
పట్టాభి వ్యాఖ్యలకు సభ్య సమాజం తలదించుకుంటోంది: ఎమ్మెల్యే అమర్నాథ్
తెదేపా నేత పట్టాభి వ్యాఖ్యలకు సభ్యసమాజం సిగ్గుతో తలదించుకుంటోందని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. సీఎం జగన్‌ను విమర్శిస్తే వైకాపా కార్యకర్తలతోపాటు సగటు ప్రజానీకం చూస్తూ ఊరుకోదని విశాఖలోని వైకాపా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి..: CBN On Attacks: 'ఆ ఇద్దరి ప్రమేయంతోనే దాడులు': చంద్రబాబు