వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్‌ను సర్వ నాశనం చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ ధ్వజమెత్తారు. సలహాదారులు ప్రభుత్వానికి ఏం సలహాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. తక్షణమే అప్పుల వివరాలు తెలపాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేకుండా చేసిన ప్రస్థానంతో మొదలుపెట్టి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురి చేశారని శైలజానాథ్ ఆరోపించారు. రాష్ట్రానికి ప్రతినెలా వస్తున్న రూ.11,000 కోట్ల ఆదాయంలో.. రూ.1100కోట్లు వివిధ కేంద్ర పథకాల కోసం కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర ఖజానాలో జమ చేసే మొత్తం అని అన్నారు. వీటిని కచ్చితంగా కేంద్ర పథకాలకే వాడాలనీ, రాష్ట్రంలో అది జరగడం లేదన్నారు. అవిపోను మిగిలేది రూ.10వేల కోట్ల ఆదాయం అని అన్నారు. ఇందులో రాష్ట్ర అప్పుల రీపేమెంట్ కోసం ప్రతినెలా రూ.3,500 కోట్లు, కార్పొరేషన్ల నుంచి తెచ్చిన అప్పుల కోసం రూ.వెయ్యి కోట్లు చెల్లిస్తోందని తెలిపారు. అంటే మొత్తం రూ.4,500 కోట్లు అప్పుల రీపేమెంట్ కి వెళ్లిపోతుందని చెప్పారు. రాష్ట్ర ఆదాయంలో దాదాపు సగం ప్రతి నెలా అప్పుల చెల్లింపులకే పోతుందన్నారు. కేంద్రం ఇచ్చిన కొత్త అప్పుల అనుమతిలో 35 రోజుల్లో రూ.9,000 కోట్లు తెచ్చేశారని, ఇంకా రూ.10,500 కోట్ల అప్పునకు అనుమతి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1956 నుంచి అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తే రాజకీయం కోసం వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టడం తగదని అన్నారు.
ఇదీ చదవండి: వైకాపా.. ప్రజలను దోచుకునే పార్టీ: శైలజానాథ్