ముఖ్యమంత్రి జగన్‌పై యనమల ట్వీట్ బాణాలు సంధించారు. చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చేసే వ్యాఖ్యలు లాఫింగ్ గ్యాస్ ఉత్పత్తి కారకాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అవినీతి రహిత రాష్ట్రంగా ఏపీని మలచడానికి జగన్ పని చేస్తున్నారని చెప్పడం పెద్ద జోక్ అని అభివర్ణించారు . వైఎస్ జగన్ ఎన్నికల అఫిడవిట్లు... వారి కుటుంబ అవినీతికి సజీవ సాక్ష్యాలని ఆరోపించారు. 2009, 2014, 2019 ఎన్నికల్లో జగన్ అఫిడవిట్లను వైకాపా నేతలు చదవాలని యనమల సూచించారు. ఈ అఫిడవిట్లే జగన్ అవినీతి, నేరచరిత్రకు అద్దం పడతాయన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ 47పేజీల అతిపెద్ద అఫిడవిట్ దాఖలు చేశారని... అందులో 18పేజీలు అవినీతి, నేర చరిత్రవే అనేది బహిరంగ సత్యమన్నారు.
2004లో జగన్మోహన్ రెడ్డి ఐటీ రిటర్న్స్‌లో చూపిన ఆస్తుల విలువ రూ.కోటి 74లక్షలు. 2009లో ఎంపీగా పోటీ చేసినప్పుడు అఫిడవిట్లో చూపింది రూ.58కోట్లు. 2010లో భారతీ సిమెంట్స్ అమ్మింది, మిగిలిన షేర్లు కలిపితే జగన్ ఆస్తి రూ.3 వేల కోట్లు.... ఇదంతా ప్రభుత్వానికి చూపిన లెక్కలు. 5ఏళ్లలో 1600 రెట్లు జగన్ ఆస్తులు ఎలా పెరిగాయి - యనమల
క్విడ్ ప్రో కో అనే అవినీతిని స్పష్టించింది వైఎస్ జగనేనని యనమల విమర్శించారు. హార్వర్డ్ లాంటి యూనివర్సిటీలలో జగన్ అవినీతి చర్చనీయాంశం అయ్యిందని.. లా పుస్తకాల్లో పాఠ్యాంశంగా జగన్మోహన్ రెడ్డి కేసులను పొందుపరిచారట అని ఎద్దేవా చేశారు. సీఎంతో సహా 17మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా ఏడీఆర్ నివేదిక వెల్లడించిందని.. మరో 9మంది మంత్రులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదైనట్లు గుర్తు చేశారు. 151మంది వైకాపా ఎమ్మెల్యేలకు గాను 88మందిపై కేసులు ఉన్నట్లు... వారిలో కూడా 50మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులని ఏడీఆర్ రిపోర్ట్లో ఉందన్నారు. ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న వైకాపా నేతల నీతులు చెబుతున్నారా అంటూ విమర్శల వర్షం గుప్పించారు. అవినీతి రహిత రాష్ట్రంగా ఏపీని మలచే ప్రధాన అజెండా ఇలాంటి వారికి ఉంటుందా అని ట్విటర్లో యనమల దుయ్యబట్టారు.