పెడ ధోరణులతో న్యాయవ్యవస్థను తీవ్ర ఒత్తిళ్లకు గురిచేస్తూ.. తొలినుంచి సీఎం జగన్ న్యాయమూర్తులను టార్గెట్ చేస్తున్నారని మండలలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కోర్టుల ముందు ట్రయల్స్‌లో జగన్పై 31 కేసులు ఉన్నాయని, ట్రయల్స్ నేపథ్యంలోనే సీఎం లేఖ రాశారని అన్నారు. నిందితులే న్యాయవ్యవస్థను బెదిరించడం నిత్యకృత్యం కారాదని వ్యాఖ్యానించారు. ప్రశాంత్ భూషణ్ పై స్పందించినట్లే, జగన్ లేఖను సీరియస్ గా తీసుకోవాలని యనమల కోరారు.
నిందితులే అత్యున్నత న్యాయమూర్తులను బెదిరిస్తే, ఇక దిగువ కోర్టులు ఎలా పనిచేస్తాయని యనమల అన్నారు. బెదిరింపుల నుంచి న్యాయవ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుదే అని ఆయన వెల్లడించారు. జగన్ రెడ్డి నిర్ణయాలు రాజ్యాంగానికి, రూల్ ఆఫ్ లా కు, కేంద్ర చట్టాలకు వ్యతిరేకమని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను పున:పరిశీలించే ప్రత్యేకాధికారం కోర్టులకు ఉందని గుర్తుచేశారు.
బాధిత వ్యక్తులు తమ రక్షణ కోసం న్యాయస్థానాల్లో అపీల్ చేసుకోవచ్చని, మొత్తం న్యాయ వ్యవస్థపైనే బురద జల్లకూడదని సూచించారు. న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై బురద జల్లుతున్న జగన్ రెడ్డి బెయిల్‌ను ఎందుకని రద్దు చేయకూడదని నిలదీశారు. భవిష్యత్తులో ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడకుండా గుణపాఠం చెప్పాలని యనమల కోరారు.
ఇదీ చదవండి: