NEW YEAR CELEBRATIONS: కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా.. మద్యం దుకాణాల సమయాల్లో మార్పులు చేస్తూ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాల్లో విక్రయాలు జరిపేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతిచ్చింది. బార్ అండ్ రెస్టారెంట్లకు అర్ధరాత్రి 12 గంటల వరకు వెసులుబాటు కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
విజయవాడలో పోలీసుల ఆంక్షలు..
కరోనా నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలపై విజయవాడ పోలీసుల ఆంక్షలు విధించారు. ఈరోజు రాత్రి బహిరంగ వేడుకలకు అనుమతి లేదని విజయవాడ సీపీ కాంతి రాణా టాటా స్పష్టం చేశారు. రాత్రి 12 గంటల వరకే ఇండోర్ వేడుకలకు అనుమతి ఉండనున్నట్లు వెల్లడించారు. అర్ధరాత్రి రోడ్లపై ఎవరూ తిరగకూడదని ఆదేశాలు జారీ చేశారు. బందరు, ఏలూరు, బీఆర్టీఎస్ రోడ్లు, పైవంతెనలు మూసివేస్తున్నట్లు సీపీ తెలిపారు. 15 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. యువత 2022ను కూడా బాధాకరంగా మార్చుకోవద్దని హితవు పలికారు. వేడుకలలో సామర్థ్యానికి మించి ఎక్కువ మందికి అనుమతి లేదని సీపీ కాంతి రాణా టాటా అన్నారు.
విశాఖలోనూ..
విశాఖ నగరంలో నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబరు 31 సాయంత్రం 6గంటల నుంచి సాగరతీరంలో ఎవరికీ ప్రవేశం లేదని స్పష్టం చేశారు. యారాడ బీచ్ నుంచి భీమిలి తీరం వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని.. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే కేసులు పెడతామని సీపీ మనీష్ కుమార్ సిన్హా హెచ్చరించారు. ఎలాంటి వేడుకలకూ అనుమతులు లేవని స్పష్టం చేశారు. రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు నిర్ణిత సమయాల వరకే తెరచి ఉంటాయని, హోటళ్ల పర్మిషన్లకు సంబంధించి.. ప్రభుత్వం సూచనల మేరకు వాటిని అనుమతిస్తామని అన్నారు.
ఇదీ చదవండి..
Perni nani on website servers down: ఆందోళన వద్దు.. వాహనదారులకు మరో అవకాశం: మంత్రి పేర్ని నాని