నాలుగేళ్ల క్రితం టాలీవుడ్‌ను కుదిపేసిన మాదకద్రవ్యాల (TOLLYWOOD DRUGS CASE) కేసులో.. మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ అధికారులు కేసు నమోదుచేసి విచారణ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా సినీరంగానికి చెందిన 10 మందితోపాటు మరో ఇద్దరికి నోటీసులు జారీచేశారు. దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మి, రకుల్ ప్రీత్‌సింగ్, నందు, దగ్గుబాటి రానా, ముమైత్‌ఖాన్, నవదీప్, తనీష్, తరుణ్, రవితేజతో పాటు ఆయన డ్రైవర్ శ్రీనివాస్, ఎఫ్ క్లబ్ మేనేజర్ హరిప్రీత్‌సింగ్‌ను ప్రశ్నించింది. వారి బ్యాంకు ఖాతాలను పరిశీలించిన ఈడీ అధికారులు అందులోని అనుమానాస్పద లావాదేవీలను అడిగి తెలుసుకున్నారు. మాదక ద్రవ్యాల సరఫరాదారులైన కెల్విన్, జీషాన్‌లను ప్రశ్నించి.. వారి ఇళ్లలో తనిఖీలు చేశారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరి బ్యాంకు ఖాతాల్లో పలు అనుమానాస్పద లావాదేవీలున్నట్లు గుర్తించిన అధికారులు వారి నుంచి కీలక సమాచారం సేకరించారు.
ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు లేవు..
2017 జూలై 2న కెల్విన్‌ను అరెస్టు చేసిన సిట్ (SPECIAL INVESTIGATION TEAM) అధికారులు.. మంగుళూరులో చదువుతున్నప్పటి నుంచే మాదక ద్రవ్యాలు విక్రయించేవాడని తెలిపారు. ఆ తర్వాత వివిధ కళాశాలలతోపాటు.... సాఫ్ట్‌వేర్, సినీరంగానికి చెందిన వారికి విక్రయించినట్లు వాంగ్మూలం ఇచ్చాడు. అతనిచ్చిన సమాచారం ఆధారంగా సిట్ అధికారులు... సినీ రంగానికి చెందిన 12 మందికి నోటీసులిచ్చి ప్రశ్నించారు. వాళ్లలో పూరీజగన్నాథ్, తరుణ్ రక్త, గోర్ల నమూనాలు ఎఫ్ఎస్ఎల్కు(forensic science laboratory) పంపగా.. అందులో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు లేవని నివేదిక ఇచ్చింది.
ఆ 12 మందికి క్లీన్‌చిట్..
ఈ మేరకు రంగారెడ్డి కోర్టులో డ్రగ్స్ సరఫరాదారుడు కెల్విన్‌పై.. నేర అభియోగ పత్రం (charge sheet) దాఖలు చేసిన సిట్ అధికారులు.. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా సినీ ప్రముఖులను నిందితులుగా పేర్కొనలేమన్నారు. వారు మత్తు పదార్థాలు తీసుకున్నట్లు ఆధారాలు లభించలేదంటూ 12 మందికి క్లీన్‌చిట్ ఇచ్చారు.
మరికొందరికి నోటీసులు జారీ చేస్తారా...
అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మాత్రం.. మాదకద్రవ్యాల కేసులో (enforcement directorate investigation on tollywood drugs case) మనీలాండరింగ్ జరిగిందా లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే పలువురి బ్యాంకు ఖాతాలు పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రస్తుతం విచారణ పూర్తైనందున ఈడీ దర్యాప్తు ఇక్కడికే ముగుస్తుందా లేదా ఆ 14 మంది ఇచ్చిన సమాచారం ఆధారంగా... మరికొందరికి నోటీసులు జారీ చేస్తారా అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.
ఇవీచదవండి.