హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలను నెలలోగా పూర్తి చేస్తామని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి స్ఫష్టం చేశారు. కోర్టు ఆదేశించినట్లుగా రిజర్వేషన్లను 50 శాతానికి కుదింపు చేసే ప్రక్రియలో అధికారులు నిమగ్నమయ్యారని తెలిపారు. రిజర్వేషన్ల ప్రక్రియ ఖరారు కాగానే... ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్లను తీసుకువచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన వెల్లడించారు.
రిజర్వేషన్లకు తెదేపానే అడ్డుపడింది
బీసీ రిజర్వేషన్ల అంశంపై కోర్టులకు వెళ్లి అడ్డుపడింది తెదేపాయేనని మంత్రి విమర్శించారు. రిజర్వేషన్ల కుదింపునకు సంబంధించి కోర్టులో కేసు వేసిన బిర్రు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు, లోకేశ్‌లకు సన్నిహితుడని ఆరోపించారు. ఆ వ్యక్తిని వైకాపా కార్యకర్త అంటూ తెదేపా ఎదురుదాడి చేయటం హాస్యాస్పదంగా ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రజల్ని మోసం చేయాలన్న ఆలోచనతో చంద్రబాబు ఆత్మవంచన చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసిన మోసాలను బీసీలు గమనించి స్థానిక ఎన్నికల్లో బుద్ది చెప్పాలని సూచించారు.
ఇదీ చదవండి: