Book Exhibition in Vijayawada: విజయవాడ పుస్తక మహోత్సవంలో భాగంగా నగరంలో పుస్తక ప్రియుల పాదయాత్ర నిర్వహించారు. ప్రెస్‌క్లబ్ నుంచి స్వరాజ్ మైదానం వరకు పాదయాత్ర సాగింది. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా ఈ ప్రదర్శనకు నాయకత్వం వహించారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు.
వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్ధులు పలు కళారూపాల్లో ప్రదర్శనలో పాల్గొన్నారు. 1992 నుంచి క్రమం తప్పకుండా సాహితీవేత్తలు, ప్రముఖులు కలిసి.. ఈ పాదయాత్రను నిర్వహిస్తున్నారు. మూడో పుస్తక మహోత్సవం నుంచి ఈ పంథా కొనసాగుతోంది. పుస్తక పఠనంపై జనంలో ఆసక్తిని పెంచేందుకు అంతా ప్లకార్డులతో ప్రదర్శన ఆనవాయితీగా వస్తోంది. 30 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ పాదయాత్రకు ఘనమైన చరిత్ర ఉంది. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు వావిలాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో తొలి పాదయాత్ర జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకూ.. ఎంతోమంది ప్రముఖులు పాలొన్నారు.
జస్టిస్ ఆవుల సాంబశివరావు, ముళ్లపూడి వెంకటరమణ, కాలోజీ నారాయణరావు, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు లాంటి ప్రముఖులతోపాటు ఎందరో ఐఏఎస్ అధికారులు ఈ పాదయాత్రలో పాల్గొని.. పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచేందుకు తమవంతు ప్రయత్నం చేశారు. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే కోల్‌కతా పుస్తక ప్రదర్శన నుంచి ఈ పాదయాత్రను నమూనాగా తీసుకున్నారు.
1992లో నిర్వహించిన విజయవాడ మూడో పుస్తక మహోత్సవానికి ముందు కోల్‌కతాకు ఇక్కడి నుంచి ఓ బృందం వెళ్లింది. అక్కడ సత్యజిత్‌రే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించే వాక్ ఫర్ బుక్స్ ర్యాలీ వీరికి బాగా నచ్చింది. ఆ స్ఫూర్తితో ఇక్కడ పుస్తక ప్రియుల పాదయాత్ర పేరుతో ర్యాలీని ఏటా నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ర్యాలీని నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: