వచ్చే జులై నాటికి ప్రొబేషన్ డిక్లరేషన్ పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి జగన్ ప్రకటనపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. రాష్ట్రవ్యాప్తంగా.. నిరసనలు చేపట్టారు. సోమవారం విధులను బహిష్కరించాలని నిర్ణయించారు.
కడప జిల్లాలో..
కడప నగరంలోని గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులు.. నగరపాలక కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. రెండేళ్ల తర్వాత రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి ఇప్పటివరకు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు పురపాలక కార్యాలయంలోని.. గాంధీ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఇప్పుడిస్తున్న 15 వేల రూపాయల వేతనంతో ఇంకెంతకాలం నెట్టుకురావాలని ప్రశ్నించారు.
విజయనగరం జిల్లాలో..
విజయనగరంలో పలు చోట్ల వార్డు సచివాలయ కార్యదర్శులు నిరసనలు చేపట్టారు. నెల్లిమర్లలో ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గరివిడిలో సంయుక్త కలెక్టర్ వెంకటరావు, గజపతినగరంలో ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్యకు.. సచివాలయ ఉద్యోగులు వినతిపత్రాలు అందజేశారు.
ప్రకాశం జిల్లాలో..
ప్రోబేషన్ డిక్లరేషన్..8నెలలు పొడిగించడంపై ప్రకాశం జిల్లా ఒంగోలులో వార్డు సచివాలయ కార్యదర్శులు మండిపడ్డారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా.. సచివాలయాల్లో ఉద్యోగులు విధులు బహిష్కరించి కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తామని..గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు ప్రకటించారు.
అనంతపురం జిల్లాలో..
ధర్మవరంలో.. వార్డు సచివాలయ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. అనంతపురంలో.. పురపాలక కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ప్రోబేషన్ డిక్లరేషన్‌చేసి.. పేస్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ప్రభుత్వ సాగదీత ధోరణి చూస్తుంటే.. భవిష్యత్ ఏమవుతుందో అర్థం కావడం లేదని కొందరు వార్డు సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
నెల్లూరు జిల్లాలో..
నాయుడుపేట జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో.. సచివాలయాల ఉద్యోగులు సమావేశమయ్యారు. రెండేళ్ల ప్రొబేషన్ సమయం పూర్తైన ఉద్యోగులకు పేస్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోమవారం నుంచి విధులకు హాజరవ్వబోమని.. ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించి ప్రదర్శన చేస్తామని చెప్పారు.
కర్నూలు జిల్లాలో..
ఆదోనిలో సచివాలయ ఉద్యోగులు సమావేశమయ్యారు. నియోజకవర్గంలో సోమవారం నుంచి సచివాలయలో విధులు బహిష్కరిస్తామని తెలిపారు. ప్రొబేషన్ డిక్లరేషన్ మరో ఎనిమిది నెలలు తొలగించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి:
Bus accident at addanki: అద్దంకిలో ప్రయాణికులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి