విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం రసాభాసగా ముగిసింది. విపక్షం లేకుండానే ఏకపక్ష తీర్మానాలతో సమావేశం సాగింది. ప్రజలపై పన్నుల భారాన్ని నిరసిస్తూ నల్ల కండువాలతో తెలుగుదేశం, సీపీఎం సభ్యులు హాజరయ్యారు. పన్ను పెంచుతూ.. అధికార పార్టీ సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానాలను ప్రతిపక్షాలు తీవ్రంగా అడ్డుకోవటంతో.. వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. ఇది అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదానికి దారితీసింది.
అయినా వెనక్కితగ్గని ప్రతిపక్ష కార్పొరేటర్లు కౌన్సిల్ వద్దే ఆందోళనకు దిగటంతో.. పోలీసులు వారిని అరెస్టు చేసి గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈలోగా ఏకపక్ష తీర్మనాలతో చెత్తపై పన్ను వసూలుకు కౌన్సిల్ ఆమోదించింది. దీంతో జూన్ నుంచీ మురికివాడల ప్రాంతాల్లోని ప్రజల నుంచి నెలకు 30 రూపాయల చొప్పున.. మౌలిక వసతులు ఉన్న ప్రాంతాల్లో కుటుంబాల నుంచి నెలకు 120 రూపాయల చొప్పున వసూళ్లు చేయనున్నారు. చెత్తరూపంలో సేకరించే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, పూల వ్యర్థాలను సేకరించి ప్రాసెసింగ్, రీసైక్లింగ్ చేసే రెండు యూనిట్లను నెలకొల్పాలని కౌన్సిల్ తీర్మానించింది.
కరోనా కష్టకాలంలో ప్రజలపై మోపిన పన్నుల భారాన్ని రద్దుచేసే వరకూ తాము వెనక్కి తగ్గేది లేదని ప్రతిపక్షాలు తేల్చి చెప్పాయి. అరెస్ట్ అయిన కార్పొరేటర్లను ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్, సీపీఎం నేత బాబూరావు పరామర్శించారు. ఆస్తి విలువ ఆధారంగా పన్నులు వేస్తే సామాన్యుడు బతికే అవకాశం ఉందా అని ప్రశ్నించారు. 3 వేల 274 మంది పొరుగుసేవల పారిశుద్ధ్య కార్మికుల పనికాలాన్ని మరో 9 నెలలు పెంచటమేగాక.. వేతనం బకాయిలు దాదాపు 15 కోట్ల మంజూరుకు తీర్మానించారు.
ఇదీ చదవండి:
WATER DISPUTES: తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులన్నీ బోర్డుల పరిధిలోకి...
ఆర్డీఎస్ కుడి కాలువ పనులు చేపట్టొద్దు: ఏపీ ఈఎన్సీకి KRMB లేఖ