విజయవాడ ప్రజలపై ఇంటి పన్నుల పెంపు భారం మోపేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. నీటి పన్నులు, భూగర్భ డ్రైనేజీ పన్నులు ఎలాగూ ఉన్నాయి. ఇక యూజర్ ఛార్జీలు, చెత్తపన్నుల విధింపులంటూ కొత్తగా బాదేందుకు సిద్ధమవుతున్నారు. నగరపాలక సంస్థకు రెవెన్యూ దాదాపు 600 కోట్ల రూపాయల వరకు ఉన్నట్లు లెక్కలు చెబుతుండగా వ్యయం 500 కోట్ల రూపాయలకు పైనే ఉంది. నగరాభివృద్ధికి 100 కోట్లు కూడా ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ప్రభుత్వ నిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. అయితే... ఆదాయ మార్గాలపై దృష్టిసారిస్తే.. ప్రజలపై అదనపు భారం పడదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పన్ను చెల్లించని కొన్ని ప్రభుత్వ సంస్థలు
విజయవాడలో దాదాపు 58 ప్రభుత్వ శాఖల ఆస్తుల నుంచి వీఎమ్సీకిి ఏటా 52 కోట్ల ఆదాయం రావాలి. ఆ మొత్తం ప్రస్తుతం 68 కోట్లకు పెరిగింది. అయితే కొన్ని ప్రభుత్వ సంస్థల్ని మినహాయిస్తే మిగిలినవి పన్నులు సక్రమంగా చెల్లించడం లేదు. సర్వీసు ఛార్జీలు మాత్రమే చెల్లిస్తామని రైల్వేశాఖ అంటుంటే.. వడ్డీలు చెల్లించలేమని ఆర్టీసీ ప్రభుత్వం ద్వారా సిఫారసు చేస్తోంది. మరోవైపు, నగరంలో ఖాళీస్థలాల్ని గుర్తించి వాటి రెవెన్యూపై పన్నులు విధించడంలోనూ వైఫల్యం కనిపిస్తోందనే విమర్శలున్నాయి. ఖాళీ స్థలాలపై పన్ను వసూలుచేస్తే 20 కోట్ల రూపాయలకుపైనే వసూలవుతుంది.
నగరంలో 2 లక్షల 2 వేల ఇళ్లుంటే 62 వేల ఇళ్లకు భూగర్భ డ్రైనేజీ కనెక్షన్లు ఉన్నాయి. మిగిలిన లక్షా 40 వేల ఇళ్లకు కూడా మంజూరు చేస్తే 9 కోట్ల 6 లక్షల ఆదాయం పెరుగుతుందనే అంచనాలున్నాయి. అక్రమ కనెక్షన్లను క్రమబద్ధీకరిస్తే.. మరింత ఆదాయం వస్తుంది. నగరంలో 5 వేల అనధికారిక కుళాయిలను క్రమబద్ధీకరిస్తే, మరో 5 కోట్లు సమకూరుతుంది. ఇక సామాజిక పార్కులు మినహా మిగిలినవాటిని ఆధునీకరించి అందుబాటులోకి తెస్తే ఏటా 2 కోట్లకు పైగా అదనపు ఆదాయం వస్తుంది. ఇక ఇటీవల పూర్తయిన భవన నిర్మాణాల ద్వారా పన్నుల రూపంలో దాదాపు 4 కోట్ల 20 లక్షల ఆదాయం రావాల్సి ఉంది..
వీఎమ్సీకిి చెందిన దాదాపు 70 వాణిజ్య సముదాయాల్లో 3 వేల 500 దుకాణాలు ఉన్నాయి. వీటిపై ఏటా 21 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. అయితే కొత్తగా నిర్మించిన దుకాణాలు వ్యాపారులకు పూర్తిగా కేటాయించలేదు. మరికొన్నింటి నిర్మాణాలకు ప్రతిపాదనలు ఉన్నాయి. అవన్నీ అందుబాటులోకి తెచ్చి లీజుకిస్తే మరో 5 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుంది. గుడ్‌విల్ కింద 20 కోట్లకుపైగా ఆదాయమొచ్చే వీలుంది. వాహనాల పార్కింగ్ ప్రాంతాలు, మరుగుదొడ్ల లీజు సొమ్ము వసూళ్లపైనా విమర్శలు వస్తున్నాయి.
అక్రమకట్టడాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణతోనూ ఆదాయం!
నగరపాలక సంస్థ ఆస్తులు, అనుబంధ అంశాలపై కోర్టుల్లో దాదాపు 13 వందల వరకు కేసులు ఉన్నాయి. వాటిల్లో చాలావరకూ బయటే పరిష్కరించుకునేందుకు మొగ్గుచూపితే కోట్ల ఆదాయం సకాలంలో సమకూరే వీలుంది. ప్రస్తుతం నగరంలో 5వేల వరకు అక్రమకట్టడాలు ఉన్నట్లు గుర్తించగా 200 వరకు అనధికారిక లేఅవుట్లు ఉన్నాయి. వాటి క్రమబద్ధీకరణకు బీపీఎస్, ఎల్ఆర్ఎస్ వంటి పథకాలు తిరిగి ప్రవేశపెట్టడం, కాలపరిమితిని తిరిగి పొడిగించడం చేస్తే.. దాదాపు 50 కోట్ల మేరకు ఆదాయం సమకూతుందనే అంచనాలున్నాయి.
ఇదీ చదవండి: