విజయవాడ ఆటోనగర్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆటో పరిశ్రమ. వాహనాలకు సంబంధించి ఎలాంటి విడిభాగాలు కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి. ఈ పారిశ్రామికవాడలో సుమారు లక్ష మంది ప్రత్యక్షంగా, నాలుగు లక్షల కుటుంబాలు పరోక్షంగా జీవనోపాధి పొందుతున్నారు. నెలకు వెయ్యి కోట్ల టర్నోవర్ జరిపిన ఘనచరిత్ర దీనిది. ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన ఆటోనగర్ కొన్ని నెలలుగా తిరోగమనంలో పడింది. నిజానికి ఏడాది చివరి నుంచి మార్చి, ఏప్రిల్ వరకు ఆటోనగర్ విపరీతమైన రద్దీగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి హడావుడి కనిపించడంలేదు. రోజువారీ కూలి దొరకడమే కష్టమవుతోంది. ఒకప్పుడు ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి ఎంతోమంది వలస రాగా.... ఇప్పుడు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కొందరు వ్యాపార విస్తరణ మానేసి పరిధి తగ్గించుకుంటున్నారు. మరికొందరు నిర్వహణ భారమై ఇతర రంగాల వైపు చూస్తున్నారు. రాజధాని అమరావతి పనులు ఆగిపోవడం, పోలవరం పనులు కూడా మందకొడిగా సాగుతుండటం ఆటోనగర్‌కు శరాఘాతంగా మారింది. దీనికి తోడు కొన్ని నెలల పాటు ఇసుక కొరత ఏర్పడి నిర్మాణాలు నిలిచిపోయాయి. కొత్త విధానం అమల్లోకి వచ్చాక మళ్లీ పనులు మొదలయ్యే లోపు రాజధాని తరలింపు ప్రతిపాదన రావడంతో కారణంగా భారీ నుంచి చిన్నపాటి నిర్మాణాల వరకు ఎక్కడివక్కడే నిలిపేసిన పరిస్థితి.
వీటన్నిటిలోనూ పనులు ఆగిపోవడంతో సిమెంటు, కంకర, ఇసుక, ఇనుము రవాణాకు ఉపయోగించే లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్ల లాంటి వాహనాలకు కిరాయి కొరవడింది. కొత్త వాహనాలు కొనేవారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. పాత వాహనాలకు మరమ్మతులు చేయించే వారు కరవయ్యారు. ఫలితంగా అక్కడక్కడా మెకానిక్ షెడ్లు మూతపడుతున్నాయి. టైర్లు పంచర్లు వేసుకునే వారి దగ్గరి నుంచి మెకానిక్‌లు, ఆటోమొబైల్స్‌కు సంబంధించిన వ్యాపారాలన్నీ కుదేలయ్యాయి. ఎప్పుడూ కళకళలాడూతూ కనిపించే ఆటోనగర్ ఇప్పుడు చాలా చోట్ల టులెట్ బోర్డులతో దర్శనమిస్తోంది.
ప్రభుత్వాల విధి విధానాల వల్ల ఆటోనగర్ పరిశ్రమ కుంటుపడుతోందని ఐలా ఛైర్మన్ సుంకర దుర్గాప్రసాద్ అంటున్నారు. కార్మికుల్ని పెంచుకొని వ్యాపారం విస్తరించాల్సింది పోయి... ఇప్పటికే చాలా మందిని కుదించాల్సి వచ్చిందని చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాజధాని రైతుల్లా తామూ రోడ్డున పడాల్సి వస్తుందేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని తరలింపు వ్యవహారం కొలిక్కిరావడంతో పాటు పోలవరం పనులు వేగవంతం కావడం, రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు కార్యరూపం దాలిస్తే తప్ప ఆటోనగర్‌కు గత వైభవం వచ్చే పరిస్థితి కనిపించడం లేదని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇదీ చదవండీ... అమరావతి రైతుల ఉద్యమానికి హైదరాబాద్ ప్రజల మద్దతు