శ్రావణమాసం... మహళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించే మాసం. ఈ నెలలో రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. నోము నోచిన ఇంట అన్నీ శుభాలే జరుగుతాయని ప్రగాఢ విశ్వాసం. అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ వ్రతంలో పూలను,పండ్లను అధికంగా వినియోగిస్తారు.
మార్కెట్లు కిటకిట...ధరలు చిటపట
పూలు కొనుగోలు చేసేందుకు వచ్చే వారితో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. శ్రావణ లక్ష్మిని రకరకాల పూలతో ఆహ్వానించాలనే కోరికతో మార్కెట్ కు వచ్చిన వారు... ధరలు విని నోరెళ్లబోడుతున్నారు. విజయవాడ పూల మార్కెట్ లో బంతి పూలు మొదలు కలువ పూలు వరకు ఏది పట్టుకున్నా ధరలు మండిపోతున్నాయి. పూవు లేనిదే పూజ చేయలేని పరిస్థితి మరి... చిన్న కలువ పూవు 40 ... సంపంగి10... గుప్పెడు మల్లెలు 50.... పావు చామంతులు 150... కిలో కనకాంబరం 700 రూపాయలు వింటుంటునే వామ్మో అనిపిస్తోంది కదూ...ఇక కొనేవారి సంగతి చెప్పనక్కర్లేదు...
డబ్బులు పోయినా... సంచి నిండట్లేదు...
రహదారుల వెంబడి పూలు విక్రయించే వారి దగ్గర ఎక్కువ ధరలుంటాయని.... పూల మార్కెట్ వరకు వెళ్తే.. అక్కడ సైతం ధరలు సామాన్యులను కంగారుపెడుతున్నాయి. 500 రూపాయలు ఖర్చు పెట్టినా.... కనీసం సంచిలో సగానికైన పూలు రావట్లేదని కొనుగోలుదారులు వాపోతున్నారు.
పువ్వులే కాదు పండ్లు సైతం...
పూలే అనుకుంటే పండ్ల ధరలు కూడా సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. సాధారణ రోజుల్లో విక్రయించే ధర కంటే పది 20 రూపాయలు అదనంగా వడ్డించేస్తున్నారు.
సాధారణంగానే శ్రావణమాసంలో పూల ధరలు ఎక్కువగా ఉంటాయి. ఈ సారి అవి మరింత ప్రియం అయ్యాయనే చెప్పాలి. వర్షాలు సరిగా లేకపోవటం వల్ల పూల సాగు తగ్గి గిరాకీ బాగా పెరిగింది. ఇదే అదనుగా వ్యాపారులు ధరలు పెంచారని... ఏటా పండగ సమయాల్లో రేట్లు పెంచేస్తున్నా...అధికారులు పట్టించుకోవడంలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.