రాష్ట్రం నుంచి ఎగుమతులను రెట్టింపు చేసే లక్ష్యంతో వాణిజ్య ఉత్సవ్ - 2021 పేరిట రాష్ట్ర ప్రభుత్వం సదస్సును నిర్వహించనుంది. రాష్ట్రంలోని ఎగుమతులకు ఉన్న అవకాశాలపై పరిశ్రమల శాఖ వివిధ రంగాలకు చెందిన వారికి వివరించనుంది. ఇవాళ్టి నుంచి రెండ్రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమానికి సీఎం జగన్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు.
రాష్ట్రంలో వాణిజ్య ఎగుమతుల ప్రోత్సాహం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో వాణిజ్య ఉత్సవ్ పేరిటట్రేడ్ ఎక్స్ పోర్ట్ కార్నివాల్‌ను నిర్వహించాలని పరిశ్రమల శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏపీ నుంచి ఎగుమతి అవకాశాలను ప్రభుత్వం వివరించనుంది. 2030 నాటికి ఏపీలోని ఓడ రేవుల నుంచి 33.7 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతుల పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు పరిశ్రమల శాఖ తెలిపింది. రెండ్రోజులపాటు జరగనున్న సదస్సును సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ వాణిజ్య ఉత్సవ్‌కు వివిధ దేశాలకు చెందిన భారత రాయబారుల ప్రతినిధులు వర్చువల్‌గా హాజరు కానున్నారు.
రాష్ట్రం నుంచి అత్యంత చౌకగా ఎగుమతులు చేసుకునే అవకాశాలను ఎగుమతుదారులకు ఏపీ ఆర్థికాభివృద్ధి మండలి వివరించనుంది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి నాలుగు ఓడ రేవుల ద్వారా 16.8 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులను రెట్టింపు చేసేలా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఎగుమతులకు ఉన్న అవకాశాలు, రవాణా, చౌకగా ఎగుమతుల అంశాలను కూడా జాతీయ, అంతర్జాతీయ ఎగుమతుదారులకు వివరించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి
Vanijya Utsavam: విజయవాడలో 'అమరావతి-వాణిజ్య ఉత్సవం-2021'..పోస్టర్ ఆవిష్కరణ