సాధారణ డిగ్రీ విద్యార్థులకు ఉపాధి అవకాశాల పెంచడంపై యూజీసీ దృష్టిపెట్టింది. సాధారణ డిగ్రీలకు ఉద్యోగాలు కల్పించడం సవాళ్లతో కూడుకున్నందున చదివే సమయంలోనే అప్రెంటిస్‌షిప్‌ను తీసుకొస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. యూజీసీ అప్రెంటిస్‌షిప్‌తో పాటు బహుళ సబ్జెక్టులను చదివే నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ అప్రెంటిస్‌షిప్‌లో ఉత్తీర్ణత సాధించకుంటే మళ్లీ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అభ్యాసన ఫలితాల ఆధారిత డిగ్రీ కోర్సులు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలతో ఉన్నత విద్యా సంస్థల అనుసంధానంపై దృష్టిసారించింది. దేశంలోని అన్ని విద్యా సంస్థలు దీన్ని పాటించాలని సూచించింది.
అప్రెంటిస్‌షిప్ డిగ్రీలో విద్యార్థులు తాను చదివే డిగ్రీ కోర్సుతోపాటు ఇతర కోర్సుల్లోని కోర్ సబ్జెక్టులో 24క్రెడిట్లు సాధిస్తే ఆయా సబ్జెక్టులో పీజీలు చేసుకోవచ్చు. ఉదాహరణకు బీబీఏ లాజిస్టిక్స్ అప్రెంటిస్‌షిప్ విద్యార్థి కోర్‌కోర్సు ఆర్థిక శాస్త్రంలో 24క్రెడిట్లు సాధిస్తే పీజీ ఎం.ఏ, ఎమ్మెస్సీ ఆర్థిక శాస్త్రం చదివేందుకు అర్హత లభిస్తుంది. చదివే డిగ్రీతోపాటు ఇతర కోర్ కోర్సులో ఒక సబ్జెక్టు చదవడం ద్వారా నచ్చిన కోర్సులో పీజీ చేసుకోవచ్చు. కోర్సు సమయంలో ఎలాంటి మార్పు చేయకుండా ఒక సెమిస్టర్ అప్రెంటిస్‌షిప్ ఉండేలా కోర్సులను రూపొందించాల్సి ఉంటుంది. అప్రెంటిస్‌షిప్‌కు 20శాతం క్రెడిట్లు ఇవ్వనున్నారు. విద్యార్థులు 132క్రెడిట్లు సాధిస్తేనే డిగ్రీ ఇస్తారు.
సెక్టార్ నైపుణ్య మండళ్లు, ఫిక్కీ, సీఐఐ, వాణిజ్య, వాణిజ్యయేతర సంస్థలు, పరిశ్రమలను సంప్రదించి ఈ డిగ్రీ కోర్సులను ఉన్నత విద్యా సంస్థలు డిజైన్ చేయాల్సి ఉంటుంది. కోర్సులను ప్రవేశ పెట్టే ముందు విద్యాసంస్థలు, పరిశ్రమలతో ఒప్పందం చేసుకోవాలి. విద్యార్థులకు శిక్షణను తప్పనిసరిగా పరిశ్రమలు, వాణిజ్య సంస్థల్లోనే అందించాలి. పరిశ్రమల్లో ఉండే మౌలిక సదుపాయాలకు అనుగుణంగానే కోర్సుల్లో సీట్లను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. జాతీయ అప్రెంటిస్‌షిప్ శిక్షణ పథకం(ఎన్‌ఏటీఎస్) నిబంధనలకు లోబడే అప్రెంటిస్‌షిప్ శిక్షణ ఉండాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేయలేం: హైకోర్టు