చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై.. వైకాపా నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేతలు తులసి రెడ్డి, శైలజానాథ్ ఖండించారు. స్త్రీ జాతిని అవమానపరిచిన వారు.. అంతకు అంత అనుభవించక తప్పదని చరిత్ర చెబుతోందని హెచ్చరించారు.
అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే అసహ్యం వేస్తోంది -తులసి రెడ్డి
అసెంబ్లీలో 19న జరిగిన సంఘటన తెలుగు జాతి చరిత్రలో ఒక దుర్దినం అని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్య నిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే అసహ్యం వేస్తోందని, జుగుప్స కలుగుతోందని వ్యాఖ్యానించారు. స్త్రీ జాతిని అవమానించిన వారు దుష్ఫలితాలు అనుభవించక తప్పదని హెచ్చరించారు.
ఇదీ చదవండి : NBK Counter To YCP Leaders: అసెంబ్లీలో ఉన్నామా..? గొడ్ల చావిడిలో ఉన్నామా..?
నిన్నటితో వైకాపా వంద తప్పులు పూర్తయ్యాయి - సాకే శైలజానాథ్
శాసనసభలో చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరిపై పలువురు నేతలు వ్యక్తిగతంగా అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేయడంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి, అదీ వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది బాధాకరమన్నారు. అసెంబ్లీలో నిన్న కొందరు సభ్యులు పశువుల కంటే హీనంగా చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరిపై అసభ్యపదజాలంతో వ్యాఖ్యలు చేయడం దిగ్భ్రాంతి కలిగించిందని అన్నారు.
రాజకీయ విమర్శలు విధానాలపై ఉండాలి కానీ.. కుటుంబ సభ్యులను అందులోకి లాగి, అసభ్యంగా మాట్లాడటం క్షమార్హం కాదన్నారు. నిన్నటితో వైకాపా వంద తప్పులు పూర్తయ్యాయని, ఇక వీరి అరాచకాన్ని ప్రజలు ఉపేక్షించబోరని, దుశ్శాసనుల భరతం పడతారని హెచ్చరించారు. వీటన్నిటికీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : Minister Perni Nani: భువనేశ్వరి ప్రస్తావనే రాలేదు.. చంద్రబాబే డ్రామా సృష్టించారు: మంత్రి పేర్ని నాని