దేశంలో కరోనా కోరలు చాస్తోంది. చిన్నాపెద్దా తేడా చూపించకుండా కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. దేశం మొత్తం లాక్డౌన్ అని కేంద్రం నిర్ణయం తీసుకోగా.. రాష్ట్రాల్లో కర్ఫ్యూలు విధిస్తూ రోడ్లపై జన సంచారం లేకుండా చేస్తున్నారు. ప్రజలు ఎవరూ నగరాల్లో తిరగడమే మానేశారు. ఎంతో మంది అనాథలు, దిక్కులేని ముసలివారు, యాచకులు ఆకలితో బాధపడే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి వారి పట్ల కొందరు ఔదార్యం చూపుతూ ఆహారం అందిస్తున్నారు.
ప్రకాశం జిల్లా చీరాలలో ఎప్పుడు రద్దీగా ఉండే రహదారులు జనసంచారం లేక నిర్మానుష్యంగా మారాయి. రైల్వే స్టేషన్ మూతపడింది. రోజుకో ఊరు తిరిగే సంచారుల పరిస్దితి దారుణంగా మారింది. ఇలాంటి వారికి వైకుంఠపురానికి చెందిన వై.లోకేష్, ఎస్.కె. అలీ అనే ఇద్దరు లారీ డ్రైవర్లు భోజన వసతి సమకూర్చారు. మూడు రోజుల నుంచి రైల్వేస్టేషన్ ఆవరణలోని చెట్టు కింద తలదాచుకుంటున్న 40 మందికి భోజనాలు పెడుతున్నారు. కృష్ణా జిల్లా నందిగామ డీఎస్పీ రమణ మూర్తి ఆధ్వర్యంలో కంచికచర్ల రహదారుల వెంట తిరిగే యాచకులకు పోలీసులు భోజనం ఏర్పాటు చేశారు.
విజయవాడలోని జవహర్ ఆటోనగర్లో... లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోగా.. మెకానిక్ షెడ్లు మూతపడ్డాయి. హోటళ్లు మూసివేసిన కారణంగా.. తినడానికి భోజనం లేక ఆటో మైబైల్ సిబ్బంది అవస్థలు పడుతోంది. వారి ఇబ్బందులను గుర్తించిన జవహర్ ఆటో నగర్ ఐలా సర్వీస్ సొసైటీ.. ప్రతి రోజు కార్యాలయ ప్రాంగణంలోనే భోజనం వండి ప్యాకింగ్ చేస్తున్నారు. డ్రైవర్లు, క్లీనర్లు, పారిశుద్ధ్య సిబ్బంది, సెక్యూరిటీ గార్డులతో పాటు పోలీసులకు కూడా ఆహారాన్ని అందజేస్తున్నారు.
ఇదీ చదవండి: