Stored meat దిల్లీ, బిహార్, ఒడిశా తదితర ప్రాంతాల నుంచి రైల్వే పార్సిళ్ల ద్వారా విజయవాడ నగరానికి గొర్రె, మేక తలకాయ, కాళ్లు టన్నుల కొద్దీ అక్రమంగా దిగుమతి అవుతున్నాయి. ఇక్కడ నుంచి పలు హాటళ్లు, మాంసం దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. గత ఏడాది రైల్వేస్టేషన్లో అధికారులు దాడులు చేసి ఐస్‌బాక్సుల్లో ఉన్న ఈ నిల్వ మాంసాన్ని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.
పల్నాడు ప్రాంతంలోని వినుకొండ, తదితర ప్రాంతాల్లో జరిగే వారాంతపు సంతల నుంచి అనారోగ్యకరమైన, మరణించిన గొర్రెలు, మేకలను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి నగరంలోని రాణిగారితోట బూషేష్‌గుప్తానగర్ ప్రాంతాల్లో నిల్వ చేస్తున్నారు. ఇక్కడ నుంచి చిన్నపాటి హోటళ్లకు, రోడ్ల వెంట అమ్మే చిరు వ్యాపారులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ప్రజారోగ్య విభాగం అధికారులు గత నెల మొదటివారంలో ఆకస్మిక దాడులు చేసి కిలోల కొద్దీ కుళ్లిన జీవాల కళేబరాలను గుర్తించి ధ్వంసం చేశారు.
పాతబస్తీ కొత్తపేట చేపల మార్కెట్ సమీపంలోని ఇళ్లల్లో ప్రతి శనివారం రాత్రి వేళల్లో గొర్రెలు, మేకల తలకాయలు, కాళ్లు కాల్చుతూ కాలుష్యాన్ని వ్యాప్తి చేస్తున్నారని, నిల్వ ఉన్న వాటిని ఆదివారాల్లో పలు మాంసం దుకాణాలు, మార్కెట్లకు తరలిస్తున్నారన్న ఫిర్యాదులపై అధికారులు ఆదివారం దాడులు చేసి, పెద్దఎత్తున నిల్వ కోడి మాంసాన్ని గుర్తించారు.
అధికలాభం.. అనారోగ్యకర మాంసం: రోజుల తరబడి ఐస్‌లో నిల్వఉంచిన, అనారోగ్యకరమైన మాంసాన్ని నగరంలోని కొందరు వ్యాపారులు అధిక లాభాల కోసం అమాయకులైన వినియోగదార్లకు అంటగడుతున్నారు. ప్రధానంగా ఆదివారాలు, ముఖ్యమైన దినాల్లో ఇటువంటి విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నగరపాలక సంస్థ కబేళాలో సాధారణ రోజుల్లో మేకలు, గొర్రెలు 250-300 వరకు వధిస్తుండగా, ఆదివారం ఆ సంఖ్య 900-1000 వరకు ఉంటోంది. ఇవన్నీ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ వైద్యపరీక్షలు, పర్యవేక్షణ, వీఎంసీ అధికారిక ముద్రలతో అమ్మకాలు సాగాలి. చాలామంది వ్యాపారులు తమ దుకాణాల వద్ద, ఇళ్లలోనే జీవాలను వధించి విక్రయిస్తున్నారు. ఇటువంటి వాటిలో చాలావరకు మరణించిన, ఇతర రోగాల బారిన పడినవే ఉంటున్నాయి. అధికారుల తనిఖీల్లో అది బయటపడింది.
దుకాణాలు తక్కువ.. విక్రయాలు ఎక్కువ: నగరపాలక సంస్థ అధికారుల లెక్కల ప్రకారం వేట మాంసం విక్రయించే దుకాణాలు 300-350, కోడి మాంసం దుకాణాలు 1200-1500 వరకు ఉన్నాయి. కబేళాలో వధించే జీవాల మాంసం కంటే, వ్యాపారులు ఆదివారాల్లో అత్యధిక మొత్తంలో విక్రయిస్తున్నారు. లెక్కకు మించిన తలకాయలు, కాళ్లు విక్రయాలు సాగుతున్నాయి. అవన్నీ పలు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్న నిల్వ జీవాలవే ఉంటున్నాయి. మరోవైపు తక్కువ వయస్సు గల కుర్రలు(గేదెలు) కోయడంతో ఆది వేట మాంసమో, బర్రె మాంసమో పసిగట్టలేని పరిస్థితి. దీంతో దీనిని వేటమాంసం మధ్యలో కల్తీ చేసి విక్రయిస్తున్నారు. చాలా వరకు ఆ సరకును హోటళ్లకు సరఫరా చేస్తుండగా, ఆహార ప్రియులు మోసపోతున్నారు. వీటిని తినడం వల్ల వివిధ అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ప్రజలు దీనిపై అప్రమత్తంగా ఉండాలని, మాంసం విక్రయాలపై ఎటువంటి అనుమానం వచ్చినా అధికారులుకు తెలపాలని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇవీ చదవండి: