సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో పాటు హైకోర్ట్ న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ..సీఎం జగన్ రాసిన లేఖను వ్యతిరేకిస్తూ ఈనెల 14న దిల్లీ హైకోర్ట్ బార్ అసోసియేషన్ తీర్మానం చేయడంపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తనను బెదిరించినట్లు ఆ సంస్థ గౌరవ కార్యదర్శి అభిజిత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మేరకు దిల్లీ పోలీస్ కమిషనర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈనెల 15న ఉదయం 11 గంటల సమయంలో ఇంగ్లండ్ నుంచి తన మొబైల్‌కు కాల్ చేసి ఓ వ్యక్తి పరిచయం చేసుకున్నాడని ఫిర్యాదులో అభిజిత్ పేర్కొన్నారు. బార్ అసోసియేషన్ తీర్మానం చేసిన విషయంపై అసభ్య పదజాలంతో దూషిస్తూ జాగ్రత్తగా ఉండాలని బెదిరించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో నుంచి బయటకు ఎలా వస్తావు...ఎప్పుడైనా యాక్సిడెంట్ జరగవచ్చని తీవ్రంగా హెచ్చరించినట్లు వివరించారు. ఇదే వ్యక్తి మరోమారు తనకు కాల్ చేసినప్పుడు...సమాధానం ఇవ్వలేదన్నారు.
తనకు వచ్చిన లండన్ నెంబర్ నుంచే దిల్లీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహిత్ మథుర్‌కూ, కోశాధికారి మోహిత్ గుప్తలకూ బెదిరింపు కాల్ వచ్చినట్లు ఫిర్యాదు చేశారు. తననూ, తన కుటుంబాన్ని ఆ బెదిరింపు కాల్స్ భయాందోళనలకు గురిచేశాయన్నారు. గౌరవ కార్యదర్శిగా తన విధులు, కార్యకలాపాలకు అడ్డుతగిలేలా బెదిరింపులు ఉన్నాయన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ, స్వతంత్రతకు భంగం కలిగించడంతో పాటు...న్యాయవ్యవస్థనూ బెదిరించేలా వ్యవహరించారని పేర్కొన్నారు. భారతీయ శిక్షా స్మృతి సహా ఇతర చట్టాల ప్రకారం తీవ్రమైన నేరానికి పాల్పడ్డారని ఈ ఫిర్యాదును తక్షణం విచారణకు స్వీకరించి దర్యాప్తు జరపాలని దిల్లీ పోలీసు కమిషనర్‌కు సీనియర్ న్యాయవాది అభిజిత్ విజ్ఞప్తి చేశారు.
ఇదీచదవండి