పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న 1700 మంది ఉద్యోగులను బాధ్యతల నుంచి ఒక్కసారిగా తప్పించడం బాధాకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఏళ్ల తరబడి ఆరోగ్య కేంద్రాల్లో స్టాఫ్ నర్సులుగా, ల్యాబ్ టెక్నీషియన్లుగా, ఏఎన్ఎంలుగా, ఫార్మసిస్టులుగా.. ఇలా అనేక బాధ్యతల్లో పని చేస్తున్నవారిని రోడ్డునపడేశారని ఆవేదన చెందారు.
యూపీహెచ్సీ (UPHC) అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రతినిధులు తమ బాధలను, ఆవేదనను జనసేన పార్టీ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. కరోనా మొదటి, రెండో దశ ఉద్ధృతంగా ఉన్న సమయంలో యూపీహెచ్సీలో విధులు నిర్వర్తిస్తున్న వీరంతా ఎంతో ధైర్యంగా సేవలు చేశారని.. ఎన్నో కష్టాలు ఎదుర్కొని ముందుకే వెళ్లారన్నారు.. కరోనా పరీక్షల నుంచి టీకాల వరకు ఎన్నో కీలక విధుల్లో పని చేశారని... అందుకు తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉండగా – ఉద్యోగ భద్రత లేకుండా చేయడం భావ్యం కాదని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేసి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 'అవుట్ సోర్సింగ్ విధానంలో మరో ఏజెన్సీని తీసుకున్నాం కాబట్టి పాతవారికి పని లేదు' అని చెప్పడంలో అర్థం లేదన్నారు. ఏజెన్సీ మారితే ఉపాధి పోవాలా? కొత్త ఏజెన్సీ కోసం ఉన్న ఉద్యోగులను బలి చేస్తారా? లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి... ఇప్పుడున్న ఉద్యోగుల సేవల్ని నిలిపివేయడం ఏమిటి? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. యూపీహెచ్సీలో అనుభవం ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లో కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్యోగులకు జనసేన పార్టీ బాసటగా నిలుస్తుందని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: Minister Kodali Nani: చంద్రబాబు, పవన్ నాటకాలు ప్రజలకు తెలుసు: మంత్రి కొడాలి నాని