ఓ వైపు బీసీలను అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్న సీఎం జగన్...మరోవైపు వారిని ఉద్దరిస్తున్నట్లుగా చెప్పుకోవటం సిగ్గుచేటని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. బీసీలు తెదేపాకు మద్దతుగా ఉన్నారన్న అక్కసుతో...ఆయా వర్గాలకు అందాల్సిన పథకాలు, ఆదరణ పరికరాలు, స్వయం ఉపాధి రుణాలను జగన్ నిలిపివేశారని ఆరోపించారు. బీసీలకు మంజూరు చేసిన ఆదరణ పనిముట్లు, బీసీ యువతకు ఇవ్వాల్సిన ట్రాక్టర్లు, జేసీబీలు, ఇతర యంత్ర పరికరాలను వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూలనపడేశారని విమర్శించారు.
పేద బీసీ యువతులకు అందించే పెళ్లి కానుకనూ రద్దు చేశారని దుయ్యబట్టారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లకు కోత పెట్టటం ద్వారా 6 వేల పదవులను బీసీలకు దక్కకుండా చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. విధులు, నిధులు, కార్యాలయాలు, కుర్చీలు లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన జగన్...వాటితో బీసీలకు ఏం ఒరగబెట్టారో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ప్రభుత్వం నియమించిన బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు వైకాపా ప్రభుత్వానికి ప్రచారకర్తలుగా మాత్రమే పనికొస్తారని ఎద్దేవా చేశారు. బీసీ కార్పొరేషన్ కార్యాలయాలు, చిరునామాలు ఎక్కడున్నాయో బీసీ మంత్రులు చెప్పగలరా? అని కాలవ ప్రశ్నించారు.
ఇదీచదవండి