Temperatures: ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో కాస్తా ఊరట లభించిందనే చెప్పవచ్చు. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉండటంతో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు దిగివచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి వచ్చాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలులో 41 డిగ్రీలు నమోదు కాగా, అత్యల్పంగా నరసరావుపేటలో 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైెంది. చిత్తూరు 40.1, నంద్యాల 39.1, కడప 38.4, పాడేరు38, భీమవరం38, విజయనగరం37.9, అనంతపురం 37.7, అనకాపల్లి 37.65, రాజమహేంద్రవరం 37.46, శ్రీకాకుళం 37.5, తిరుపతి 37.1, కాకినాడ 36.5, మచిలీపట్నం 36.5, విజయవాడ 36.3, ఏలూరు 36.01, ఒంగోలు 35.5, గుంటూరు 34.9, బాపట్ల 34.6, విశాఖ 34.6, పార్వతీపురం 34.02, నెల్లూరు 32.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పలు చోట్ల మోస్తారు వర్షాలు: రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తారుగా వర్షాలు కురిశాయి. ప్రకాశం జిల్లా దర్శి, పొదిలిలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. రోహిణి కార్తె సమీపిస్తున్న తరుణంలో వర్షం పడటం వల్ల ఎండలు విపరీతంగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
*శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రిలో గాలివాన బీభత్సానికి వేణుగోపాల్ అనే రైతు వ్యవసాయ తోటల్లోని 250 చీనీ చెట్లు నేలకొరిగాయి. సుమారుగా రూ.5 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. మండలంలోని పలు గ్రామాల్లో మామిడి కాయలు నేలరాలాయి. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: వేసవి శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి రోజా.. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గైర్హాజరు