రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలపై తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. పెరిగిన ధరలతో దీపావళి నాడు టపాసులకు బదులు సామాన్యుల గుండెలు పేలుతున్నాయని అన్నారు. పండుగ రోజున ప్రజలు పస్తులతో, చీకట్లో ఉండే దుస్థితిని సీఎం జగన్ రెడ్డి కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ రెడ్డి గద్దె దిగిన నాడే ప్రజలకు నిజమైన దీపావళి అని అన్నారు. చేతకాని పాలనతో ప్రజలకు దీపావళి వెలుగులు లేకుండా చేశారని మండిపడ్డారు. ప్రజాజీవనాన్ని నిర్వీర్యం చేసేలా ఆర్థిక మాంద్యం సృష్టించారని అనిత ఆరోపించారు. పప్పు బెల్లాలపై కూడా పన్నులు వేయటంతో ఎన్నడూ లేని విధంగా నిత్యవసరాల ధరలు పెరిగాయన్నారు.
కూరగాయలు, పప్పులు, నూనెల ధరలు ఆకాశాన్నంటుతుంటే ప్రజలు ఎలా పండుగ చేసుకుంటారని ఆమె ప్రశ్నించారు. ఆర్భాటంగా ధరల స్థిరీకరణ నిధి ప్రకటించిన జగన్ రెడ్డి.. ఏనాడూ ధరల నియంత్రణకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని తెలిపారు. ఉత్తర కొరియా తరహాలో.. తినటం తగ్గించుకోవటమే ఉత్తమం అనే పరిస్థితులు రాష్ట్రంలో కల్పిస్తున్నారని అనిత దుయ్యబట్టారు.
ఇదీ చదవండి : TDP: రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు: గోరంట్ల