తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన కూల్చివేత ప్రక్రియ రాత్రింబవళ్లు జరుగుతోంది. కూల్చివేతల విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగానే వెళ్తోందని అధికారులు చెబుతున్నారు. కూల్చివేతలకు ఇంప్లోసివ్ విధానం, పేలుడు పదార్థాల వినియోగం లాంటి పద్దతులున్నప్పటికీ... పరిసరాల్లో ఉన్న భవనాలు, హుస్సేన్ సాగర్‌ను దృష్టిలో ఉంచుకొని యంత్రాల సహాయంతోనే నేలమట్టం చేయాలని నిర్ణయించింది.
చురుగ్గా పనులు..
సచివాలయ ప్రాంగణంలో మొత్తం 10 బ్లాకులు ఉండగా మొదటి రోజే దాదాపు అన్ని బ్లాకులకు సంబంధించిన కొంత భాగాలను కూల్చివేశారు. రాతికట్టడం కావడం వల్ల ప్రవేశద్వారం వద్ద ఉన్నందున విద్యుత్ శాఖ కార్యాలయాన్ని వీలైనంత త్వరగా నేలమట్టం చేయాలని ఆదేశించినట్లు సమాచారం. పురాతన భవనమైన జీ- బ్లాక్ సర్వహిత భవన కూల్చివేత పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఒక్కో అంతస్తును కూల్చివేశాక సంబంధిత శిథిలాలను పక్కకు తప్పించాల్సి ఉంటుందని... ఆ తర్వాతే తదుపరి అంతస్తు కూల్చివేత సాధ్యమవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కూల్చివేత ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని, అనుకున్నదాని కంటే కొంత ఎక్కువ సమయం పట్టవచ్చని అంటున్నారు.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ..
కూల్చివేత ప్రక్రియను సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సచివాలయం వైపు ఎవరూ వెళ్లకుండా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. సచివాలయం పరిసరాల్లో ఆంక్షలు అమలు చేయడంతో పాటు చుట్టూ పోలీసు సిబ్బందిని మోహరించారు. ఉద్యోగులను గుర్తింపు కార్డులు చూసి కార్యాలయాలకు అనుమతించినప్పటికీ... సచివాలయం వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇవీ చూడండి: కరోనాను ఖతం చేసే యంత్రం ఆవిష్కరణ!