KTR comments on AP: దేశంలో వ్యవసాయం తర్వాత ఆ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది నిర్మాణ రంగమేనని.. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు కూడా అవసరం లేదని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆన్నారు. క్రెడాయ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ పరోక్షంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పరిస్థితిపై మిత్రులు చెప్పిన మాటలను ఆయన ప్రస్తావించారు.
‘‘పక్క రాష్ట్రంలో కరెంట్, నీళ్లు లేవని.. రోడ్లన్నీ ధ్వంసమై ఉన్నాయని మిత్రులు చెప్పారు. అక్కడ పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. మా ఊరు నుంచి హైదరాబాద్ వచ్చాక ఊపిరి పీల్చుకున్నట్లు ఉందని చెప్పారు. నేను చెప్పేది అతిశయోక్తి కాదు. తెలంగాణ గురించి నేను డబ్బా కొట్టుకోవడం కాదు.. పక్క రాష్ట్రం వెళ్లి మీరే చూడండి. అక్కడికి వెళ్లి చూసి వస్తే మీరే మమ్మల్ని అభినందిస్తారు. కొన్ని మాటలంటే కొంత మందికి నచ్చకపోవచ్చు కానీ.. అవి వాస్తవాలు’’ -కేటీఆర్, తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి
విద్యుత్ కొరతను తీర్చారు.. తెలంగాణ సీఎం కేసీఆర్ తన దక్షత, సమర్థతతో రాష్ట్రంలో 6నెలల్లో విద్యుత్ కొరతను తీర్చారని.. కేటీఆర్ తెలిపారు. గృహాలు, వ్యవసాయం, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని.. చెప్పారు.
హైదరాబాద్‌కు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఉపాధి పొందుతున్నారని.. కానీ ఇక్కడి యువత మాత్రం గల్ఫ్‌కు వలస పోతున్నారని కేటీఆర్ అన్నారు. చేసే పనిలో తేడా లేకపోయినా కుటుంబాలకు దూరంగా వెళ్తున్నారని.. లోపం ఎక్కడుందని ప్రశ్నించారు. నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిరిసిల్ల తదితర ప్రాంతాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని.. ఇక్కడే ఉపాధి కల్పించేలా చొరవ తీసుకోవాలని క్రెడాయ్ ప్రతినిధులకు కేటీఆర్ సూచించారు.
కార్మికులకు సంబంధించిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ అందించేందుకు ముందుకొస్తే ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ఒక ప్రయత్నం చేద్దామని.. సక్సెస్ అయితే దాన్ని కొనసాగిద్దామన్నారు. క్రెడాయ్ హైదరాబాద్ పరిధిలో తొలుత దాన్ని ప్రారంభించాలని.. ఆ తర్వాత మిగతా ప్రాంతాలకు దాన్ని విస్తరించాలని కోరారు.
ఇదీ చదవండి:
Paper leak: పదో తరగతి ఆంగ్లం పేపర్ లీక్..! 10 గంటలకే వాట్సప్‌లో వైరల్