లాక్‌డౌన్‌తో అన్ని రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అంతర్ రాష్ట్ర సర్వీసులను నడిపే విషయంలో రాష్ట్రాలకే కేంద్రం స్వేచ్ఛ ఇచ్చింది. మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ప్రబలుతుండటంతో అధికారులు ఆ పనుల్లో తలమునకలుగా ఉన్నారు.
కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలతోపాటు అధికార పార్టీలో అసమ్మతి రాగాలు వినిపిస్తుండటంతో ఆ రాష్ట్రాలతో సంప్రదింపులకు మరింత సమయం పడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే తెలంగాణకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఏపీతో ఒప్పందం చేసుకోవాలని తెలంగాణ నిర్ణయించింది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్యే ఎక్కువ బస్సులు తిరుగుతాయి.
కిలోమీటర్ల లెక్కా.? రూట్ల ప్రాతిపదికా?
ఒప్పందానికి కిలోమీటర్లను ప్రామాణికంగా తీసుకోవాలా? రూట్ల సంఖ్యనా అనే అంశాన్ని అధికారులు ఆలోచిస్తున్నారు. ఉభయ రాష్ట్రాలు ఏయే రూట్లలో ఎన్ని కిలోమీటర్ల మేర బస్సులు నడపాలో చేసుకునే ఒప్పందాన్ని కిలోమీటర్ల పద్ధతిలో కుదుర్చుకున్న ఒప్పందంగా పరిగణిస్తారు. అలాకాకుండా టీఎస్‌ఆర్టీసీ ఏయే రూట్లలో ఏపీకి ఎన్ని సర్వీసులు నడపాలో... ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని బస్సులు తిప్పాలో నిర్ణయిస్తూ ఒప్పందం చేసుకుంటే అది రూట్ల ప్రాతిపదికన జరిగినదిగా పరిగణిస్తారు.
ప్రస్తుతం కిలోమీటర్ల ప్రాతిపదికన ఒప్పందం అమల్లో ఉంది. సుమారు రెండు వేల రూట్లలో సర్వీసులు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఆ ప్రకారమే ముందుకెళ్లటమా? లేక మార్పులు, చేర్పులు చేయటమా? అని అధికారులు యోచిస్తున్నారు. మార్పులు చేర్పులు చేయాలంటే నోటిఫికేషన్ జారీ చేయాలి. అభ్యంతరాలను పరిష్కరించాలి. అందుకు కొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కోసం ఒకటిరెండు రోజుల్లో అధికారుల స్థాయిలో సంప్రదింపులు జరుగుతాయని ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’కు చెప్పారు.
ఏపీ పర్మిట్లే ఎక్కువ
విభజన తొలినాళ్లలో రెండు రాష్ట్రాలకు హైదరాబాద్ రాజధానిగా ఉండటంతో రాకపోకలు ఎక్కువగా ఉండేవి. ఆంధ్రా ఆర్టీసీ అధిక సంఖ్యలో పర్మిట్లు తీసుకుంది. ఆ దామాషాలో ఆర్టీసీ పర్మిట్లు తీసుకునేందుకు రాష్ట్రం ఆసక్తి చూపలేదు. ఆ కారణంతోనే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ నుంచి 900 వరకు బస్సులు నడుస్తున్నాయి. రాష్ట్రం నుంచి ఆంధ్రాకు 680 బస్సులే రాకపోకలు సాగిస్తున్నాయి.
- ఇవీ చూడండి: అమ్మా.. అని పిలిపించుకోకముందే.. ఆ తల్లి..!