రాష్ట్రంలో జగన్ పీనల్ కోడ్ అమలు చేస్తున్నారని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం తన బహిరంగ లేఖలో మండిపడ్డారు. ఐపీఎస్ బదులు జేపీఎస్(జగన్ పోలీస్ సర్వీస్) వ్యవస్థ ఇక్కడ నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలిపిన విద్యార్థులపై అత్యాచార కేసులు పెట్టడమేమిటని ప్రశ్నించారు. సీఎం జగన్ స్క్రిప్ట్ మేరకే టీఎన్ఎస్ఎఫ్ నేతలపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. వైకాపా కార్యాలయం నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదవడమే పోలీస్ బాస్ల ఉద్యోగంగా మారిపోయిందని విమర్శించారు. కేసులు, సెక్షన్లు తెలియని వాళ్లు పోలీస్ శాఖలో ఉండటం దారుణమన్నారు.
దారుణాలకు పాల్పడ్డ వైకాపా శ్రేణులపై కేసులు నమోదు చేయరని.. సీఎం ఇల్లు ముట్టడిస్తే ఏకంగా అత్యాచారం కేసు పెడుతున్నారని నాదెండ్ల బ్రహ్మం ఆందోళన వ్యక్తం చేశారు. విద్వేషం, విధ్వంసం తప్ప విజ్ఞత లేకుండా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఒక వైపు దేవుళ్లకు, మరోవైపు విద్యార్థులకు రక్షణ లేకుండా చేస్తున్నారన్నారు. తప్పుడు కేసులు పెట్టడంపై హోం మంత్రి, డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జీవో 77 రద్దు చేసి రాష్ట్ర విద్యార్థులందరికీ సీఎం క్షమాపణ చెప్పాలన్నారు.
ఇదీ చదవండి: అమెరికాలో ట్రంప్.. ఆంధ్రాలో వైకాపా: ఎమ్మెల్సీ అశోక్