రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని మండిపడ్డారు. స్వాతంత్య్ర దినోత్సవ వేళ ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో... పట్టపగలే నడిరోడ్డుపై ఎస్సీ యువతిని దారుణంగా హతమార్చారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని ఆక్షేపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలే లక్ష్యంగా రాష్ట్రంలో నేరాలు జరుగుతున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్కు చీకటి జీవోలు ఇవ్వడంపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలు కాపాడటంలో లేదని విమర్శించారు.
రాష్ట్రంలో నియంతత్వ పాలన...
బాధితులకు అండగా నిలుస్తున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం దారణమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయం జరిగిందని బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినా... పట్టించుకునే వారు కరవయ్యారని పేర్కొన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి జగన్ నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎస్సీలు, మహిళలపై కొనసాగుతున్న అఘాయిత్యాలపై అమెరికా మానవహక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేయటం వైకాపా ప్రభుత్వ భద్రతా వైఫల్యానికి నిదర్శనమన్నారు.
నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోబోం...
తెదేపా హయాంలో నిర్మించిన పోలీస్ స్టేషన్లను దిశ స్టేషన్లుగా మార్చి ప్రచారం చేసుకున్నారని చంద్రబాబు మండిపడ్డారు. దిశ చట్టం ద్వారా ఎంతమందిని శిక్షించారో చెప్పాలని ప్రశ్నించారు. మహిళల రక్షణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే... చూస్తూ ఊరుకోమని, బాధిత మహిళలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.
ఇదీచదవండి.