పురపోరులో పట్టు సాధించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. చంద్రబాబు స్వయంగా ప్రచారంలో పాల్గొననున్నారు. మార్చి 1 నుంచి ఎన్నికలు జరిగే అన్ని నగరపాలక సంస్థల్లో ప్రచారం నిర్వహించనున్నారు. చంద్రబాబుతో పాటు, లోకేశ్, అచ్చెన్నాయుడు సహా ఇతర ముఖ్యనేతలు రంగంలోకి దిగనున్నారు. వరుస పర్యటనలు, రోడ్‌షోలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రజలపై వేసిన పన్నుల భారాన్నే ప్రధాన అజెండాగా తెలుగుదేశం ప్రచారం సాగనుంది.
పుర ఎన్నికల ప్రచారం ప్రారంభానికి ముందే నేతల మధ్య నెలకొన్న విభేదాలను చంద్రబాబు పరిష్కరించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విజయవాడ, గుంటూరు నేతల మధ్య సయోధ్య కుదిర్చే ప్రక్రియ వేగవంతం చేశారు. విజయవాడ 39వ డివిజన్ వివాదాన్ని అచ్చెన్నాయుడు పరిశీలిస్తున్నందున అంతవరకూ వేచి చూడాలని నేతలకు తెలిపారు. బొండా ఉమ, కేశినాని మధ్య మనస్పర్థలపై చంద్రబాబు దృష్టిసారించారు. కేశినేని నాని కుమార్తె మేయర్ అభ్యర్థిగా ఆ వర్గం ప్రచారం చేసుకుంటుంటుండగా.. సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థికి మేయర్ పీఠం కోసం బొండ ఉమ పట్టుబడుతున్నారు. గుంటూరులోని 37, 42 డివిజన్లలో పోటీపైనా నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ సమస్య పరిష్కార బాధ్యతలనూ అచ్చెన్నాయుడికి అప్పగించారు. విజయవాడ, గుంటూరుపై ప్రత్యేక దృష్టిసారించిన తెలుగుదేశం రాష్ట్రస్థాయి నేతలను ఇక్కడ ప్రచారానికి తీసుకురావాలని భావిస్తోంది.
పుర ప్రచారానికి ముందు ఈనెల 25, 26 తేదీల్లో సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల విశ్లేషణతోపాటు...స్థానిక పరిస్థితులపై నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం : ఎస్ఈసీ