ASHOK BABU ON CM JAGAN: అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్నా సీఎం జగన్ రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయటం లేదని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక కేవలం.. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని నిలదీశారు. పీఆర్సీ ఎందుకు అమలు చేయడంలేదో చెప్పాలన్నారు.
ఉద్యోగులను చర్చల పేరుతో పిలిచి.. ప్రతిసారి రాష్ట్ర ఆర్థిక పరిస్ధితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి పంపుతున్నారని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలు అమలు చేయమంటే.. రాష్ట్ర ఆర్థిక పరిస్ధితి బాగోలేదంటూ వైకాపా ప్రభుత్వం కుంటి సాకులు చెబుతోందని ఆయన మండిపడ్డారు.
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేతకాని పాలన వల్లే.. రాష్ట్రం ఆర్దిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. నాడు ఆర్థిక లోటులో సైతం చంద్రబాబు తెలంగాణ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారని.., ఉద్యోగులు 29 శాతం ఫిట్‌మెంట్ అడిగితే 43 శాతం పెంచిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు.
ఉద్యోగ విరమణ వయస్సు 58 ఏళ్ల నుండి 60 ఏళ్లకు పెంపు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు 20 శాతం పెంపు, సమైక్యాంధ్ర ఉద్యమంలో 81 రోజుల సమ్మె కాలానికి పెండింగ్లో ఉన్న వేతన బకాయిల చెల్లింపు, 11వ పీఆర్సీ నివేదిక ఆలస్యమైనందుకు 20 శాతం మధ్యంతర భృతి ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని స్పష్టం చేశారు. నాడు తీవ్రమైన ఆర్థిక లోటులో ఉండి కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగులకు అన్ని విధాల మేలు చేశారని.., కానీ సీఎం జగన్ మాత్రం ఇచ్చిన హామీలు కూడా అమలు చేయకుండా మోసం చేస్తున్నారని ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు.
ఇదీ చదవండి: CM JAGAN DELHI TOUR: రేపు దిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి జగన్...ప్రధాని మోదీతో భేటీ