TDP leaders Letters to Speaker and Chairman of the Legislature: నాటుసారా, జే బ్రాండ్ల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు చట్టసభలలో ప్రభుత్వం చర్చకు అంగీకరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ.. స్పీకర్, శాసనమండలి ఛైర్మన్‌కు.. తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేఖ రాశారు.
జే బ్రాండ్లలో ప్రజల ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకర రసాయనాలున్నాయంటూ.. ల్యాబ్ రిపోర్టులు లేఖలకు జోడించారు. కల్తీ సారా కారణంగా జంగారెడ్డిగూడెంలోనే వారం రోజుల్లో 28 మందికి పైగా మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. పిచ్చిమద్యాన్ని అత్యధిక ధరలకి అమ్ముతుండడంతో నిరుపేదలు సారాకి అలవాటు పడి ప్రాణాలు తీసుకుంటున్నారని వాపోయారు. ప్రభుత్వం సహజ మరణాలంటూ చర్చ నుంచి తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. సారా విక్రయదారులపైనా, తయారీదారులపై ఓ వైపు కేసులు పెడుతూ.. మరోవైపు అసలు సారాయే లేదని చెప్పడం.. సభని తప్పుదోవ పట్టించడమేనని మండిపడ్డారు. జే బ్రాండ్ల మరణాలపై న్యాయవిచారణ జరిపించాలని కోరారు. సారా మరణాలపై తాము చర్చకు పట్టుబట్టటంతో.. ఎస్ఈబీ రాష్ట్రవ్యాప్తంగా జరిపిన దాడుల్లో సారా విక్రయం, తయారీపై 1129 కేసులు నమోదు చేసి, 677 మంది నిందితులని అరెస్టు చేశారు. ఇంతమందిని అరెస్టు చేశారంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోందని.. దీనిపై దృష్టి సారించాలని లేఖల్లో వెల్లడించారు. ప్రమాదకర మద్యంతోనే మరణాలు సంభవించాయని అన్ని ఆధారాలు తాము సభ ముందు ఉంచడానికి సిద్ధంగా ఉన్నట్లు తెదేపా నేతలు స్పష్టం చేశారు.
పట్టించుకోవటం లేదు కాబట్టే విజిల్..
మా నిరసనలు ప్రభుత్వం పట్టించుకోవడంలేదు కాబట్టే సభలో విజిల్ వేశామని తెదేపా నేతలు తెలిపారు. కల్తీసారాపై చర్చకు పట్టుబడితే.. ఆరుగురు సభ్యులను సమావేశాల నుంచి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశాలు మొదటి రోజు ఐదుగురు సభ్యులను సస్పెండ్ చేయగా... ఇవాళ మరో ఆరుగురు సభ్యులను సమావేశాల నుంచి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజల ప్రాణాలకంటే ముఖ్యమంత్రి భజనే ప్రభుత్వానికి ఎక్కువైందని నేతలు ఆరోపించారు. జే బ్రాండ్ మద్యం, నాటుసారా స్లో పాయిజన్ లా ప్రజలపై ప్రభావం చూపుతోందన్నారు. కల్తీసారా తాగటం వల్లే అవయవాలు దెబ్బతిని ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. సభలో నాటుసారా ఆధారాలు తాము బయటపెడుతుంటే.. సీఎం ముఖం చాటేశారన్నారు. తమ సభ్యుల్ని సస్పెండ్ చేశాకే సభను నడిపిస్తున్నారని విమర్శించారు. మార్షల్స్ సాయంతో నడుస్తున్న సభ చూస్తే సిగ్గేస్తోందన్నారు. ఎంతమందిని సస్పెండ్ చేసినా.. కల్తీసారాపై పోరాడతారని స్పష్టం చేశారు. ప్రజల కోసమే తాము అన్నీ భరిస్తున్నామని తెలిపారు. కల్తీసారా మరణాలపై ఆధారాలతో దొరికేసరికి ప్రభుత్వానికి నోట మాట రావట్లేదని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి:
Demolition of Anna Canteen: కడపలో అన్న క్యాంటీన్ కూల్చివేత..!