ఇసుక కొరతపై ఈ నెల 14న తెదేపా అధినేత చంద్రబాబు చేసే దీక్షా స్థలం.. ధర్నా చౌక్‌ను ఆ పార్టీ నేతలు పరిశీలించారు. అన్ని వర్గాల వారు పెద్దఎత్తున చంద్రబాబు దీక్షకు తరలివస్తారని తెలిపారు. అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని పార్టీలు చంద్రబాబు దీక్షకు సంఘీభావం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో సిమెంట్ బస్తా ధర ఎందుకు పెరిగిందో సమాధానం చెప్పాలని మాజీమంత్రి ఉమా డిమాండ్ చేశారు. లోపాయికారి కుంభకోణంలో భాగంగానే సిమెంటు ధర పెరిగి ఇసుక కొరత ఏర్పడిందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగానే చంద్రబాబు దీక్ష అని తెదేపా సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి వెల్లడించారు. హిట్లర్ లాంటి జగన్ పాలనను నియంత్రించేందుకు పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని తెలిపారు.
దీక్షా దృష్టి మరల్చేందుకే..ఆంగ్ల మాధ్యమ అంశం
ఇసుక కొరతపై చంద్రబాబు చేపట్టబోయే దీక్ష నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం అంశాన్ని తెరపైకి తెచ్చిందని.. తెదేపా రాష్ట్ర కార్యదర్శి పిల్లి మాణిక్యాలరావు ఆరోపించారు. గుంటూరులోని తెదేపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం చేతగాని తనంతోనే ఇసుక సమస్య వచ్చిందన్నారు. భవన నిర్మాణ రంగానికి సంబంధించిన వారంతా ఈ దీక్షకు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఇదీ చదవండి:
''నేను చేసుకున్న పెళ్లిళ్లతోనే జగన్ రెండేళ్లు జైలుకెళ్లారా..?''