విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నేతలు తమ తమ నివాసాల వద్ద నిరసన దీక్షలు చేపట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్లో భౌతిక దూరం పాటిస్తూ నేతలు, కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహం ముందు 12 గంటల దీక్షకు కూర్చున్నారు.
మాజీ మంత్రి దేవినేని ఉమా గొల్లపూడిలోని తన నివాసంలో దీక్షకు దిగగా.., విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రాంమోహన్ అయన భార్య గద్దె అనురాధతో కలిసి దీక్ష చేపట్టారు. జగన్ తన ఏడాది పాలనలో విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించారని నేతలు మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేశారని విమర్శించారు. విద్యుత్ పీపీఏలు రద్దు, కోర్టులు, కేంద్రం, విదేశాల హెచ్చరికలు బేకాతరు చేశారని విమర్శించారు. సీఎం జగన్ మూర్ఖత్వంతో వ్యవహరిస్తూ.. ఏపీని అంధకారంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో విద్యుత్ రంగానికి కేంద్రం నుంచి అవార్డులు వస్తే.., జగన్ పాలనలో ప్రజల నుంచి చీవాట్లు వస్తున్నాయన్నారు. లాక్ డౌన్ సమయంలో 3 నెలల బిల్లులు ఎత్తవేయాలని నేతలు డిమాండ్ చేసారు.