TDP Leaders On YSRCP Govt: రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కళావెంకట్రావు ఆరోపించారు. సుమారు 5 లక్షల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం.. ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపిందన్నారు. వైకాపా పాలనలో అభివృద్ధి, సంక్షేమం అనేవి లేకుండా పోయాయని ఎద్దేవా చేశారు. పేద ప్రజలను దోచుకునేందుకు తెచ్చిన ఓటీఎస్ పథకాన్ని వెంటనే ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు మంజూరు చేసిన గృహాలపై వారికి ఏనాడో హక్కులు కల్పించాయన్నారు. మళ్లీ హక్కు కల్పిస్తామంటూ పేదలను దోచుకునేందుకు యత్నించటం సరికాదని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందన్న కళా.. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే వారిని అక్రమ అరెస్టుల పేరుతో భయబ్రాంతులకు గురిచేస్తోందన్నారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
విద్యార్థుల కడుపు నింపలేరా..?
రంగులకు రూ.3,500 కోట్లు వృథా చేసిన జగన్ ప్రభుత్వం..,పేద విద్యార్థుల కడుపునింపడానికి రూ.500 కోట్లు విడుదల చేయలేదా ? అని మాజీ మంత్రి పీతల సుజాత నిలదీశారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులకు, గుడ్లు, పాలు సరఫరా చేసే ఏజెన్సీలకు జగన్ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో లక్షల మంది విద్యార్థులు ఆకలికి అలమటిస్తున్నారన్నారు. ప్రభుత్వ వాటాగా ఒక్కో విద్యార్థికి భోజనం ఖర్చు కింద 9.40 రూపాయలు కూడా చెల్లించలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందా? అని మండిపడ్డారు. ఇసుక పాలసీ పేరుతో రూ. 10 వేల కోట్లు, మద్యం పేరుతో రూ. 25 వేల కోట్లు దోచేసిన జగన్ ప్రభుత్వం.. విద్యార్థుల కడుపు నింపడానికి డబ్బులు ఇవ్వకపోవటం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు హయాంలో విద్యా ప్రమాణాల అమల్లో దేశంలో 2వ స్థానంలో నిలిచిన రాష్ట్రం.. జగన్ నిర్వాకాలతో 19వ స్థానానికి పడిపోయిందన్నారు. రూ. 3 లక్షల కోట్లు అప్పులు తెచ్చి, ప్రజలను నిలువునా ముంచిన ముఖ్యమంత్రికి.. పేద విద్యార్థుల కడుపు నింపడానికి మనసు రాకపోవటం బాధాకరమన్నారు.
ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదు..
వైకాపా ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి జీవీ. రెడ్డి మండిపడ్డారు. కంపెనీలు, పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్ర ఆదాయం పెంచటం చేతగాక ప్రజలపై పన్నులు, ఇసుక, మద్యం అమ్ముకోవటం, రియల్టర్లు, ఇతరత్రా రంగాల నుంచి అందిన కాడికి వసూలు చేస్తోందని ధ్వజమెత్తారు. 15వ ఆర్థిక సంఘం నిధులనే దారి మళ్లించిన వారు.. లే అవుట్ల రెగ్యులరైజేషన్ పేరుతో రియల్టర్ల నుంచి వసూలు చేసిన సొమ్ముని ప్రజల కోసం ఖర్చు పెడతారా ? అని ప్రశ్నించారు. 2020 జనవరి నుంచి రెగ్యులరైజేషన్ ఛార్జీల పేరుతో రియల్టర్ల నుంచి ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు రూ. 10 వేల కోట్లు వసూలుచేసిందన్నారు. అది చాలదన్నట్లు ఇప్పుడు పేదలకు 5 శాతం భూమి అంటూ కొత్త దోపిడీకి సిద్ధమైందన్నారు. నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లను వైకాపా రంగులతో ముద్రించి వాటిపై జగన్ ఫొటో వేయటమేంటని జీవీ ప్రశ్నించారు.
ఇదీ చదవండి