రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిస్తున్న కుమారుడు జగన్‌కు వైఎస్సార్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఎందుకు బుద్ధి చెప్పట్లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు. జగన్ గెలుపు కోసం ప్రజల్ని మభ్యపెట్టిన విజయమ్మ, షర్మిలలు రాష్ట్రం అల్లకల్లోమవుతుంటే ఇప్పుడు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక్క ఛాన్స్ ప్రణాళికలో భాగంగా ప్రజల్ని మోసగించేందుకు జగన్, విజయమ్మ, షర్మిల ఎవరి పాత్ర వారు సమర్థవంతంగా పోషించారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు జగన్ రెడ్డి ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానమూ..అమలు కావట్లేదని ఆరోపించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో రోజూ ధర్నాచౌక్ రద్దీగా ఉంటోందన్నారు. ప్రజలకు జరిగిన మోసం పట్ల బాధ్యతలు గుర్తించి ముఖ్యమంత్రి తల్లి, సోదరి విజయవాడ ధర్నాచౌక్‌లో నిరసన తెలపాలని డిమాండ్ చేశారు.
'విద్యుత్ బిల్లు పట్టుకుంటేనే ప్రజలకు షాక్ కొడుతోంది'
వైకాపా ప్రభుత్వంలో విద్యుత్ బిల్లు పట్టుకుంటేనే ప్రజలకు షాక్ కొడుతోందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. గడచిన రెండేళ్లలో రూ.9500 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన రూ.24,500 కోట్లు దారి మళ్లించారని ఆయన ఆరోపించారు.
"తెదేపా ప్రభుత్వం అధికారంలో నుంచి దిగిపోయే నాటికి విద్యుత్ పంపిణీ సంస్థలకు కేంద్రం ప్రకటించే ర్యాంకుల్లో ఏపీఈపీడీసీఎల్ (APEPDCL) ఏ గ్రేడ్‌లో ఉంటే ఏపీ ఎస్పీడీసీఎల్ (APSPDCL) బీప్లస్ గ్రేడు సాధించింది. జగన్ అధికారం చేపట్టాక జూలై 2021 నివేదిక ప్రకారం ఏపీఈపీడీసీఎల్ (APEPDCL) సీ గ్రేడ్‌కు ఎస్పీడీసీఎల్ (APSPDCL) బీ గ్రేడ్‌కు పడిపోయాయి. ఆడిట్ నివేదికలు మోసపూరితంగా ఉండటం, సబ్సిడీలు సక్రమంగా చెల్లించకపోవటం గ్రేడ్లు పడిపోవటానికి కారణాలుగా కేంద్రం పేర్కొంది. ఈ నివేదికలపై సజ్జల ఏం సమాధానం చెబుతారు. తెదేపా ప్రభుత్వం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.62463కోట్లు అప్పు చేసిందని సజ్జల అసత్యాలు చెప్పారు. 2019 మార్చి 31వరకూ ఉన్న అప్పు రూ.18023కోట్లు మాత్రమే. ఇతర రాష్ట్రాలతో పోల్చితే చాలా తక్కువ. వైకాపా అధికారం చేపట్టిన రెండేళ్లలోనే 2020 డిసెంబర్ నెలాఖరు వరకూ రూ.24,500కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి అప్పు తెచ్చి కూడా నాణ్యమైన విద్యుత్ అందించలేకపోతోంది."- కొమ్మారెడ్డి పట్టాభి, తెదేపా అధికార ప్రతినిధి
విదుత్య్ బిల్లుల అంశంపై ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన మంత్రి బాలినేని నల్ల డబ్బును హవాలా రూపంలో విదేశాలకు తరలించే పనిలో ఉన్నారని పట్టాభి విమర్శించారు. మంత్రివర్గం అవసరం లేదని భావిస్తే..మంత్రులందరితో రాజీనామా చేయించి, ముఖ్యమంత్రి, సజ్జలే పరిపాలించుకోవచ్చు కదా అని సూచించారు. తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీల నుంచి ప్రజలకి ఉపశమనం కల్పించకుంటే తెదేపా ప్రత్యక్ష పోరాటానికి దిగుతుందని హెచ్చరించారు.
'అది ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనం'
తెదేపా ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన సామాజిక భవనాల స్థలాల్లో నిర్మాణాలు చేపట్టనివ్వకుండా..ప్రభుత్వ స్థలాలు అని బోర్డులు పెట్టడం వైకాపా ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమని బొండా ఉమా ఆరోపించారు. విజయవాడలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం, వాసవీమాత ఆలయానికి గత ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆర్యవైశ్య సంఘం నాయకులు చేపట్టిన నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు. గతంలో కేటాయించిన సామాజిక భవనాల స్థలాల్లో నిర్మాణాలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే అన్ని సామాజిక వర్గాలతో కలిసి తెదేపా ఐక్యవేదికగా ఉమ్మడి పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి
YSR VARDHANTHI: ఇడుపులపాయలో వైఎస్ఆర్కు సీఎం జగన్, కుటుంబసభ్యుల నివాళి