"గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు న్యాయం చేయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. పోలవరం నిర్వాసితులకు ఏం చేస్తారు" అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి దుయ్యబట్టారు. తన సొంత జిల్లాలోని గండికోట నిర్వాసితులను సీఎం జగన్.. దారుణంగా మోసగించాడని మండిపడ్డారు. నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా రిజర్వాయర్లో నీటిని నిల్వచేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో ఒక్కో నిర్వాసిత కుటుంబానికి రూ. 6.35 లక్షలు ఇస్తే.. తాను అధికారంలోకి వస్తే రూ. 10 లక్షలు ఇస్తామని జగన్ చెప్పారని గుర్తు చేశారు. రెండేళ్లు గడిచినా నేటికీ ఒక్క నిర్వాసిత కుటుంబానికీ రూపాయి పరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మద్యంపై వచ్చే ఆదాయంతోనే రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు:సయ్యద్ రఫీ
ముఖ్యమంత్రి జగన్.. మహిళల కన్నీళ్లను రక్తంగా మార్చి మరీ తన ఖజానా నింపుకొంటున్నారని తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ మండిపడ్డారు. మూడు దశల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తానన్న జగన్.. నేడు మద్యంపై వచ్చే ఆదాయంతోనే రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడని విమర్శించారు. 'జగనన్న ఈజీ తాగుడు - తూగుడు' పేరుతో కొత్త పథకం అమలు చేయాలని ప్రభుత్వం చూస్తోందా అని నిలదీశారు.
90 ఎంఎల్ లిక్కర్ సీసాలు, 330 ఎంఎల్ బీర్ క్యాన్ల అమ్మకాలు ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. మద్యపాన నిషేధం అవుతుందా అని సయ్యద్ రఫీ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఖరి చూస్తుంటే భవిష్యత్లో మొబైల్ మద్యం దుకాణాలు, ఇంటింటికీ మద్యం సరఫరా పథకాలు అమలు చేస్తారేమో అని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి:
AP Corona cases today: రాష్ట్రంలో కొత్తగా 1,321 కరోనా కేసులు, 19 మరణాలు