మాన్సాస్ ట్రస్ట్ విషయంలో హైకోర్టు తీర్పు హర్షణీయమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. అధికార అహంతో ఇష్టానుసారం వ్యవహరిస్తే జగన్‌కు చెంపపెట్టులు తప్పవని హితవు పలికారు. న్యాయస్థానం తీర్పును ప్రభుత్వం గౌరవించాలని సూచించారు. ఏ ప్రభుత్వం గతంలో ఇన్నిసార్లు కోర్టులతో తలంటించుకోలేదని అచ్చెన్న ఎద్దేవా చేశారు. ట్రస్ట్ పరిధిలో ఉన్న వేలాది ఎకరాల ఆస్తులు, భూములను కొట్టేసేందుకే ఛైర్మన్‌గా ఉన్న అశోక్ గజపతిరాజును తొలగించారని ఆక్షేపించారు.
ఇది రాజ్యాంగ విజయం: అయ్యన్నపాత్రుడు
మాన్సాస్ ట్రస్ట్‌కు సంబంధించిన జీవోలను హైకోర్టు ధర్మాసనం కొట్టేయటం రాజ్యాంగ విజయమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యనించారు . "ఏ1, ఏ2 రెడ్డిల అరాచకాలకు ఇకనైనా అడ్డుకట్ట పడాలి. మాట వినకపోతే ఏసీబీ, వైకాపాలో చేరకుంటే జేసీబీ, ప్రజ్యావ్యతిరేకత విధానాలు ఎండగట్టే ప్రజాప్రతినిధులపైకి పీసీబీల్ని వాడుతోన్న మూర్ఖపురెడ్డి, అర్థరాత్రి అక్రమ జీవోలిస్తూ చీకటి జీవోల రెడ్డి అయ్యాడు. పెద్దలు పూసపాటి అశోక్‌గజపతిరాజు వైపు న్యాయం, ధర్మం ఉంది. ఏ కోర్టుకెళ్లినా రాజ్యాంగవిరుద్ధమైన చీకటి జీవోలు కొట్టివేత తప్పదు." ట్వీటర్ వేదికగా దుయ్యబట్టారు.
ప్రజలు ప్రభుత్వంపై కక్ష కట్టే రోజు త్వరలో వస్తుంది: సోమిరెడ్డి
కక్ష సాధింపులు మానకుంటే ప్రజలే ప్రభుత్వంపై కక్షకట్టే రోజు త్వరలో వస్తుందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు. విజయనగరం గజపతి రాజులు దేశానికే ఆదర్శమన్నారు. అలాంటి కుటుంబానికి చెందిన అశోక్ గజపతి రాజుపై కక్ష కట్టి మాన్సాస్ ట్రస్టు, సింహాచలం అప్పన్న దేవస్థానం బాధ్యతల నుంచి తప్పించారని ఆక్షేపించారు. ఇవాళ హైకోర్టు తీర్పుతో తిరిగి బాధ్యతలు చేపడుతుండటాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
విజయసాయి రెడ్డి క్షమాపణ చెప్పాలి: బుద్ధా
హైకోర్టు తీర్పుతోనైనా...అశోక్ గజపతి రాజుకి విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రలో పేదలకు సంక్షేమానికి పాటుపడుతున్న మాన్సాస్ ట్రస్టు ఆస్తులను కొట్టేసేందుకు ఏ2 విజయసాయిరెడ్డి కుట్ర పన్నారన్నారు. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి కనువిప్పు కావాలని హితవు పలికారు.
ఇదీచదవండి
మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్.. సంచయిత గజపతిరాజు నియామక జీవో రద్దు