రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి.. ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. పారిశ్రామికాభివృద్ధిపై మంత్రి గౌతమ్ రెడ్డి అన్నీ అవాస్తవాలే చెప్పారన్నారు. తిరోగమనంలో పయనిస్తున్న పారిశ్రామిక రంగం పట్ల మంత్రి కాకి లెక్కలు చెప్పటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. రెండేళ్లలో వివిధ పరిశ్రమల ఉత్పత్తి గణనీయంగా పడిపోవడమే కాక పాటు కొత్తగా ఒక్క పరిశ్రమా రాలేదన్నారు. ఎంఎస్ఎంఈలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా మత్స్యకారుల పేరుతో షిప్పింగ్ యార్డులను బినామీలు, అనుయాయులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు.
జీఎస్డీపీ రేటు 1.58శాతంగా నమోదైనట్లు మంత్రి తప్పుదారి పట్టిస్తున్నారని.. అంతా బాగుంటే పారిశ్రామిక వృద్ధిరేటు -3.26 కి, సేవా రంగం వృద్ధి రేటు -6.71కి ఎలా పడిపోతుందని ప్రశ్నించారు. గత రెండేళ్లలో కియా అనుబంధ పరిశ్రమలతో పాటు లులూ గ్రూప్, ఆసియా పేపర్ మిల్, అదానీ డాటా సెంటర్, హెచ్ఎస్బీసీ వంటి ఎన్నో ప్రఖ్యాత సంస్థలు, రూ.17 లక్షల కోట్లు విలువ చేసే ఇతర భారీ పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయన్నారు. లక్షకు పైగా రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు ఉంటే కేవలం 12 వేల పరిశ్రమలకే రూ.905 కోట్లు రీస్టార్ట్ ప్యాకేజీ ఇచ్చి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. రూ.5 వేల కోట్లు పారిశ్రామిక ప్రోత్సాహకాలు చెల్లించాల్సి ఉండగా రెండేళ్లలో రూపాయి కూడా చెల్లించలేదని విమర్శించారు.
ఇదీ చదవండి: