ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాలపై సొంత పార్టీ ఎమ్మెల్యేల మనోవేదనపై ముఖ్యమంత్రి జగన్ ఏం సమాధానం చెప్తారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య నిలదీశారు. జగన్ సామాజిక వర్గానికి చెందిన వైకాపా నేతలు తనను ఎలా అణచివేస్తున్నారో ఎస్సీ ఎమ్మెల్యే శ్రీదేవి తన సంభాషణల్లో వాపోయారన్నారు. ఎమ్మెల్యేల పరిస్థితి ఇలా ఉంటే, ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న నారాయణస్వామి సీఎం కార్యక్రమంలో చేతులు కట్టుకుని వెనుక నిలుచున్నారని గుర్తుచేశారు.
ఎస్సీలు ఏ హోదాలో ఉన్నా జగన్ ముందు నిలబడాల్సిందేనా అని వర్ల ప్రశ్నించారు. ప్రభుత్వంలోని వారి పరిస్థితి అలా ఉంటే, ఇక సామాన్యుల దుస్థితి చెప్పాల్సిన పనిలేదన్నారు. శిరోముండనాలు, హత్యలు, అబద్ధాల ఆరోపణల లాంటివి జరిగినా ముఖ్యమంత్రి ఏనాడూ స్పందించలేదని విమర్శించారు. ఎస్సీ నాయకుడిగా తాను ప్రతి రోజూ చంద్రబాబు పక్కనే కూర్చుని ఆలోచనల్ని పంచుకుంటానన్న వర్ల.. వైకాపాలో కనీసం జగన్ పక్కన ఏ ఎస్సీ నాయకుడైనా కూర్చోగలరా అని ప్రశ్నించారు.
దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు వారినే వేధిస్తున్నారు. పార్టీలోని అగ్ర వర్ణాల నేతలు తమను అణచివేస్తున్న తీరుపై ఎస్సీ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. నాయకుల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటో అర్ధం అవుతోంది. వైకాపాలో ముఖ్యమంత్రి పక్కన కూర్చునే సాహసం ఏ ఎస్సీ నాయకుడైనా చేయగలరా -- వర్ల రామయ్య, తెదేపా నేత
ఇవీ చదవండి...