సీఐడీ కళంకిత అధికారులపై చర్యలు తీసుకొని బాధితులకు సత్వరం న్యాయం చేయాలని కోరుతూ తెదేపా నేత వర్ల రామయ్య ఎన్‌హెచ్‌ఆర్‌సీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని జూన్ 29న గార్లపాటి వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన సీఐడీ వికృత తీరుకు నిదర్శనమని ఆయన లేఖలో పేర్కొన్నారు. సీఐడీ పోలీసులు దొంగల మాదిరి గోడ దూకడమే కాకుండా వెంకటేశ్వరరావు ఇంటి తలుపులు పగులగొట్టారని మండిపడ్డారు. లైట్లు ఆర్పేసి వెంకటేశ్వరావు తల్లి, సోదరితో అనుచితంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 41-ఏ నోటీసు ఇచ్చేందుకు గోడ దూకి తలుపులు పగలగొట్టాల్సిన అవసరం ఏమిటని వర్ల లేఖలో నిలదీశారు.
జూన్ 30న మోకరాల సాంబశివరావు అనే మరో వ్యక్తిని మంగళగిరిలో బలవంతంగా అరెస్టు చేశారని వర్ల లేఖలో పేర్కొన్నారు. అరెస్టు సమయంలో సాంబశివరావు భార్య బిడ్డకు పాలు పడుతున్నా..బెడ్‌రూమ్‌లోకి బలవంతంగా వెళ్లారన్నారు. వెంకటేశ్వరరావు, సాంబశివరావులను వేర్వేరు గదుల్లో ఉంచి చిత్రహింసలకు గురిచేశారని వాపోయారు. వెంకటేశ్వరరావును కొట్టడంతో అతను తీవ్ర గాయాలపాలై అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయని లేఖలో వివరించారు. కస్టడీలో బాధితులను చిత్రహింసలకు గురి చేయాల్సిన అవసరమేంటని నిలదీశారు. కళంకిత అధికారులను ప్రలోభపెట్టి అసమ్మతిని అణిచివేసేందుకు వైకాపా ప్రభుత్వం సీఐడీని ఉపయోగిస్తోందన్నారు. రాష్ట్రంలో సీఐడీ దుశ్చర్యలపై సమగ్ర విచారణ జరిపించాలని వర్ల లేఖలో కోరారు.
ఇవీ చూడండి