వ్యవసాయ రంగానికి, రైతులకు.. సీఎం జగన్(cm jagan) వెన్నుపోటు పొడిచారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(tdp leader somireddy chandramohan reddy) విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో.. దళారులు చేరి, చివరకు రైతు నోట్లో మట్టి కొడుతున్నారని ధ్వజమెత్తారు. రైతు లేకపోతే దేశమే లేదనే వాస్తవాన్ని.. పాలకులు ఎందుకు విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండున్నరేళ్ల పాలనలో జగన్ సర్కారు.. రైతులకు ఏం చేసిందని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద.. రైతుల కోసం ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఒక్క రైతుకు కనీసం నాగలి కూడా ఇవ్వలేదు..
తెదేపా హయాంలో రైతు రథం పథకం కింద.. రైతులకు 20వేల ట్రాక్టర్లను పంపిణీ చేసిందని గుర్తు చేశారు. వైకాపా కనీసం ఒక్క రైతుకు కూడా నాగలి ఇచ్చింది లేదని ఎద్దేవా చేశారు. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలకు.. తెదేపా ప్రభుత్వం రూ.1700 కోట్లు ఖర్చు పెడితే, జగన్మోహన్ రెడ్డి రూపాయి కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. వ్యవసాయ శాఖలో పలానా దానికి ఇంత ఖర్చు పెట్టామని చెప్పగల ధైర్యం.. ప్రభుత్వానికి, వ్యవసాయమంత్రికి ఉందా అని సవాల్ విసిరారు.
ఇదీ చదవండి: