విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలోని ఆలయంలో.. సీతమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడంపై.. తెదేపా నేత పట్టాభిరాం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేవాలయంలోని సీతమ్మ మట్టి విగ్రహం కిందపడి విరిగిపోవడంపై ఆందోళన చేపట్టారు. ఎలుకలు లేదా గాలి ద్వారా విగ్రహం ధ్వంసమై ఉంటుందన్న పోలీసుల వ్యాఖ్యలపై పట్టాభిరాం అసహనానికి లోనయ్యారు.
ఆలయంలో నిన్న పూజలు చేసి తాళం వేశానని దేవాలయ పూజారి తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదని...ఆలయ భద్రతను ఆర్టీసీ వారు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. మరో వైపు ఆలయం చుట్టూ పటిష్ఠ భద్రత, నిరంతరం సిబ్బంది ఉంటారని ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. విగ్రహం ధ్వంసంపై దర్యాప్తు జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు.
డీసీపీ విక్రాంత్ పాటిల్ స్పందన..
విజయవాడ సీతారామ మందిరం వద్ద ఆందోళనకు దిగిన తెదేపా నేతలు, మాజీ మంత్రి దేవినేని ఉమతో డీసీపీ విక్రాంత్ పాటిల్ చర్చలు జరిపారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామన్న హామీతో ఆందోళకారులు...నిరసనను విరమించుకున్నారు. ఉదయంకల్లా సీతమ్మ విగ్రహం ముందుకు పడి ధ్వంసమై ఉందని...ఎవరైనా విగ్రహం ధ్వంసం చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఇది దుండగ పని అని తేలితే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇదీ చదవండి: