వైకాపా నాయకులకు 'జగనన్న జేబు కత్తెర' పేరిట సీఎం ప్రత్యేక పథకం పెట్టారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు. వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇతర నాయకులు మాత్రమే ఈ పథకం లబ్ధిదారులని దుయ్యబట్టారు. బులుగు కత్తెర, ఆకుపచ్చ రిబ్బను ఈ కత్తెరకు ఉన్న అదనపు ప్రత్యేకతలని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో సమగ్రంగా అమలవుతున్న జగనన్న జేబు కత్తెర ఏకైక పథకం ద్వారా వైకాపా నేతలు రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల జేబులు కత్తిరించి ఇష్టానుసారం దోచుకోవటమే ప్రధాన లక్ష్యంగా ఉన్న ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవటంలో మంత్రి జయరాం ముందంజలో ఉన్నారని ధ్వజమెత్తారు. జగనన్న జైలు ముద్ద పథకం కూడా త్వరలోనే అమలుకానుందన్న సంగతి ఈ నేతలంతా గ్రహించాలని హెచ్చరించారు.
జయరాం కుటుంబ సభ్యులందరిపై ఎఫ్ఐఆర్ నమోదై అడ్డంగా దొరికిపోయినా మంత్రిని ఎందుకు కాపాడుతున్నారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 24గంటల్లో మంత్రిపై చర్యలు తీసుకోకుంటే రైతుల పక్షాన ఉద్యమిస్తామని ప్రకటించారు. ప్రజలు ప్రతి నెలా రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి తమ భూములు పరిశీలించుకోకపోతే వైకాపా భూ బకాసురులు మింగేస్తారని పట్టాభి హెచ్చరించారు.
ఇవీ చదవండి..