Pattabhi On Ganta subbarao arrest: గంటా సుబ్బారావుపై వైకాపా ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం బాధాకరమని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు. సుబ్బారావు లివింగ్ అబ్దుల్ కలాం అని కొనియాడిన పట్టాభి.. రాష్ట్ర యువత శ్రేయస్సు, భవిత కోసం తన జీవితాన్నే త్యాగం చేశారన్నారు. యువత భవితకు ఎంతో కీలకమైన జవహర్ నాలెడ్జ్ సెంటర్ల రూపకల్పనలో సుబ్బారావును గతంలో చంద్రబాబు ఉపయోగించుకున్నారని గుర్తు చేశారు. ఆ తరువాత వైఎస్సార్ కూడా పార్టీలు, రాజకీయాలకు అతీతంగా సుబ్బారావు సమర్థతను గుర్తించి ఆయన సేవలను జేకేసీల్లో కొనసాగించారని తెలిపారు. అలాంటి గొప్ప వ్యక్తిని కటకటాల్లోకి పంపినందుకు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు.
సుబ్బారావు అరెస్టైన రోజు నిజంగా ప్రభుత్వానికి బ్లాక్ డే అని పట్టాభి దుయ్యబట్టారు. గంటా సుబ్బారావు నైపుణ్యం, విశిష్టత క్రిమినల్ మనస్తత్వ పాలకులకు ఏం తెలుస్తాయని విమర్శించారు. పాలకులకు తెలిసిందల్లా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధించటం, బురద జల్లటమేనని మండిపడ్డారు. జవహర్ నాలెడ్జ్ సెంటర్స్ నిర్వహణలో తనదైన ముద్రవేసి, రాష్ట్రవ్యాప్తంగా కొన్ని లక్షలమంది విద్యార్థుల్లో స్కిల్స్ పెంపొందించటమే సుబ్బారావు చేసిన తప్పా అని ప్రశ్నించారు.
ఏం జరిగిందంటే..
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సీమెన్స్ ప్రాజెక్టు వ్యవహారంలో రూ.241 కోట్లు మేర నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఫిర్యాదుపై నమోదైన కేసులో సంస్థ మాజీ సీఈవో, ఎండీ గంటా సుబ్బారావును సీఐడీ అధికారులు సోమవారం అరెస్టు చేశారు. వైద్య పరీక్షలు చేయించిన అనంతరం విజయవాడ ఎనిమిదో అదనపు జిల్లా న్యాయస్థానంలో ఆయనను హాజరుపరిచారు. సుబ్బారావు తరఫున హైకోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణ వాదనలు వినిపిస్తూ..ఈ కేసుతో ఆయనకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. సీఐడీ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆనంద జ్యోతి వాదిస్తూ ఈ కేసులో మరింత మంది పాత్ర ఉందని.. ఇలాంటి సమయంలో సుబ్బారావుకు రిమాండు విధించకపోతే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం సుబ్బారావుకు ఈ నెల 24 వరకూ రిమాండు విధిస్తూ న్యాయమూర్తి శ్రీనివాస ఆంజనేయమూర్తి ఆదేశాలిచ్చారు. అనంతరం ఆయనను మచిలీపట్నం జైలుకు తరలించారు.
సోదాలు జరిపిన 3 రోజుల తర్వాత అరెస్టు
సీమెన్స్ ప్రాజెక్టు వ్యవహారంలో నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ ఈ నెల 9న సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. 10న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ హైదరాబాద్ శివారు షాబాద్‌లోని గంటా సుబ్బారావు నివాసంలో సోదాలు నిర్వహించారు. అనంతరం ఆయన సొంత కారులోనే విజయవాడకు తీసుకొచ్చారు. గత రెండు రోజులుగా ఆయనను రహస్య ప్రాంతాల్లో విచారించారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణకు సోమవారం మధ్యాహ్నం హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. ఆ విషయం వెలుగుచూసిన కొద్దిసేపటికే గంటా సుబ్బారావు అరెస్టయ్యారు. ఆ తర్వాత న్యాయస్థానంలో హాజరుపరిచారు.
ఇదీ చదవండి