పచ్చి అబద్ధాలతో పిట్టకథలు చెబుతున్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థికమంత్రి స్థాయిని దిగజారుస్తున్నారని తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. జగన్ పాలన ప్రారంభమై ఏడాది గడిచినా ఒక్క గృహమైనా ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు నిర్మించిన గృహాలు నాణ్యంగా ఉన్నాయని లబ్ధిదారులు అంగీకరించిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. వైఎస్, కాంగ్రెస్ హయాంలో నిర్మించిన గృహాల్లో 14 లక్షలు కాగితాల మీద ఉన్నప్పటికీ.. భూమి మీద లేవని రుజువైంది నిజం కాదా అని ప్రశ్నించారు.
స్కాం కోసమే ఇళ్ల స్థలాల పథకం
సీఎం జగన్ ఇచ్చే 2 సెంట్ల ఇళ్ల స్థలాల కోసం ఇప్పటికే 4,300 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని.. ఈ డబ్బు గృహ నిర్మాణం మీద పెట్టి ఉంటే చంద్రబాబు నిర్మించిన 13 లక్షల గృహాలతో పాటు మరో 15 లక్షలు ఇళ్లు వచ్చి ఉండేవని కాల్వ అన్నారు. స్కాం కోసమే ఇళ్ల స్థలాల పథకాన్ని పెట్టి... 2 వేల కోట్ల రూపాయల స్కాం చేశారని ఆరోపించారు. పేదల పేరుతో దోచుకుంటున్నారని విమర్శించారు. దానిని కప్పిపుచ్చుకోవడానికే బుగ్గన ఎదురు దాడి చేస్తూ... వక్రీకరిస్తున్నారని కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు.