నీటిపారుదల రంగం పట్ల జగన్ సర్కారు నిర్లక్ష్యం.. రాష్ట్ర భవిష్యత్తుకు శాపంగా మారిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు అన్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత గత రెండేళ్లలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా చేపట్టలేదని విమర్శించారు. చేపట్టదలచిన 42 ప్రాజెక్టుల్లో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎన్ని పూర్తి చేశారని ప్రశ్నించారు.
చంద్రబాబు హయాంలో రూ. 65 వేల కోట్లు ఖర్చు పెట్టి.. 62 ప్రాజెక్టులు చేపట్టి.. వాటిలో 23 ప్రాజెక్టులను పూర్తి చేశామని కాల్వ శ్రీనివాసులు గుర్తుచేశారు. జీతభత్యాలు కూడా కలుపుకుని 2 ఏళ్లలో సాగునీటి రంగానికి జగన్ ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం రూ. 8 వేల కోట్లేనని తెలిపారు.
రాయలసీమ, ఉత్తరాంధ్ర, పల్నాడు కరవు నివారణ పేరుతో రూ. 72 వేల కోట్లతో అమలు చేయాలనుకుంటున్న 6 ప్రాజెక్టులతో పాటు నిర్మించ తలపెట్టిన 42 ప్రాజెక్టులకు రూ. 96 వేల కోట్లు అవసరమన్నారు. ఏటా రూ. 4 వేల కోట్లు కూడా ఖర్చు చేయకుంటే ప్రాజెక్టులన్నీ పూర్తి చేయటానికి 30 ఏళ్లు పడుతుందని నిలదీశారు. రైతు ద్రోహిగా వైకాపా ప్రభుత్వం నిలిచినందున.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ త్వరలోనే సాగునీటి ప్రాజెక్టులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తుందని కాల్వ వెల్లడించారు.
ఇవీచదవండి: