అధికార పార్టీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని.. తక్షణమే భద్రత కల్పించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేశ్... అజిత్ సింగ్ నగర్ పోలీసులకు, విజయవాడ నగర కమిషనర్‌కు, డీజీపీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ, బాధితులైన ప్రజల తరఫున నిలబడి క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తున్నందుకు అధికార పార్టీ నాయకులు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ లేఖలో పేర్కొన్నారు.
గుర్తు తెలియని నెంబర్ల నుంచి అర్ధరాత్రి కాల్స్ చేసి.. బెదిరిస్తున్నారని డూండి రాకేశ్ తెలిపారు. తాజాగా మార్చి 19న ఇంటి చుట్టూ కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ముసుగు వేసుకుని ఇంటి చుట్టూ తిరిగారంటూ అందుకు సంబంధించి సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పోలీసులకు సమర్పించారు. తాను ఇంట్లో లేని సమయంలో అర్ధరాత్రి వేళ తలుపు తడుతుండడం వంటి ఘటనలతో తన కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురవుతున్నారన్నారు. సదరు ఫోన్ కాల్స్, రెక్కీ నిర్వహణ ఘటనలపై పోలీసులు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు.
ఇదీ చదవండి: పథకాల మాటున 10 శాతం ఇచ్చి 90 శాతం దోచేస్తున్నారు: చంద్రబాబు